Vijayawada: రోడ్డుపై వెళ్తూ సీఎం జగన్ ఫైర్.. అధికారుల ఉరుకులు, పరుగులు.. అసలేం జరిగిందంటే..
జాతీయ రహదారి వెంట వెళ్లే వారికి దుర్గంధం రాకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. ఇటీవల ఎనికేపాడులో తాగునీరు కలుషితమై పలువురు డయేరియా బారినపడ్డారు.
ఏళ్లుగా సాగుతున్న నిర్లక్ష్యం సీఎం జగన్ చొరవతో చివరికి పరిష్కారానికి నోచుకుంది. వెంటనే అధికారులు హుటాహుటిన ఆ సమస్యను పరిష్కరించారు. అసలేం జరిగిందంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం, ఆదివారాల్లో తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చే ప్రయాణంలో రాత్రిపూట వచ్చేప్పుడు విజయవాడలోని ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లోకి ఆయన క్యాన్వాయ్ వచ్చేటప్పటికి విపరీతమైన దుర్వాసన వచ్చింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్ స్వయంగా తన కార్యాలయం అధికారులతో మాట్లాడి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫలితంగా సీఎంఓ నుంచి సంబంధిత శాఖ అధికారులకు అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్‌కు ఆదేశాలు వెళ్లాయి. సోమవారం ఉన్నతాధికారుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. దీంతో ఓ కాలువ వల్ల ఆ దుర్వాసన వస్తున్నట్లుగా గుర్తించారు. విజయవాడ కనకదుర్గ కాలనీ, బల్లెంవారివీధి, ప్రసాదంపాడు, ఎనికేపాడు, ఆటోనగర్‌లలో డ్రైనేజీ ప్రాంతాలు, వంద అడుగుల రోడ్డును పరిశీలించారు. ఆటో నగర్ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర మురుగు నీటితో కలిసి ఆ ప్రాంతంలో దుర్గంధం వస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ప్రత్యామ్నాయం ఇలా..
జాతీయ రహదారి వెంట వెళ్లే వారికి దుర్గంధం రాకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. ఇటీవల ఎనికేపాడులో తాగునీరు కలుషితమై పలువురు డయేరియా బారినపడ్డారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆటో నగర్ నుంచి వచ్చే మురుగు ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతంలో నిలువ ఉంటోందని గుర్తించారు. దీనికి పక్కా డ్రైనేజీ నిర్మించాలని, జాతీయ రహదారిని టచ్ కాకుండా ఆటోనగర్ నుంచి నిడమానూరు మీదుగా మురుగు నీటిని పంపించాలని ప్రతిపాదించారు. ఆటోనగర్ పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీరుపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read : ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
అధికారుల ఉరుకులు పరుగులు
ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, సచివాలయ సెక్రటరీలు, వివిధ శాఖల అధిపతులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా మురుగు కాలువల వెంట పరుగులు పెట్టిన తీరు స్థానికుల్లో ఉత్సుకత రేపింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఏఎంఆర్‌డీ కమిషనర్ విజయ్ కృష్ణన్, స్వచ్ఛ భారత్ ఎండీ సంపత్‌కుమార్, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, మున్సిపల్, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇలా చాలా మందే వచ్చారు.