AP Floods: ఏపీలో వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన, తేదీ ఫిక్స్
AP CM Chandrababu | ఏపీలో వరద బాధితులకు ఇటీవల ప్రకటించిన సాయం మొత్తాన్ని అందించడానికి తేదీని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు అధికారులతో కీలక సమీక్షలో పాల్గొన్నారు.
AP Floods Compensation | అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు సమీక్ష చేశారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై సీఎం చంద్రబాబు సమీక్షలో చర్చించారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీన వరద బాధితులకు పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
వరద బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల వరద బాధితులకు భారీ పరిహారాన్ని ప్రకటించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించనుంది. చనిపోయిన పశువులకు, నష్టపోయిన వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిహారం అన్ని వర్గాల బాధితులకూ ఒకేసారి చెల్లించనుంది. ఇళ్లు మునిగిపోయిన వారితో పాటు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం డబ్బులు బుధవారం అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. నష్టపరిహారం విషయంలో తమ పేరు నమోదు కాలేదు అని ఎవరి నుంచి ఫిర్యాదు రాకూడదని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 10 వేల వాహనాలకు గాను ఇప్పటి వరకు 6 వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తి అయినట్లు అధికారులు చెప్పారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.
Also Read: Tirumala News: తిరుమల లడ్డూ వివాదం, అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ