Pinnelli Ramakrishna Reddy News : ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట.- 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు
Macherla News: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో లభించినట్టుగానే మిగతా మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ దొరికింది. ఆ కేసులో అనుసరించిన షరుతులే ఈ మూడు కేసుల్లో కూడా వర్తిస్తాయని కోర్టు తేల్చి చెప్పింది.
పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో తనపై దాడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సహించారని టీడీపీ పోలింగ్ ఏజెంట్ కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు అయింది. దీంతోపాటు మాచర్లలో జరిగిన వేర్వేరు ఘర్షణల్లో కూడా ఆయన్ని మొదటి ముద్దాయిగా చేరుస్తూ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మాచర్ల అభ్యర్థిగా ఉన్నందున తాను కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని అందుకే బెయిల్ ఇవ్వాలని... అసలు ఆ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రత్యర్థులు వాదించారు. ఆయన ప్రోత్సాహంతోనే మాచర్లలో ఘర్షణలు జరిగాయిని వాదించారు. ఒకసారి ఆయన బయటకు వస్తే సాక్షులు ప్రభావితం అవుతారని మళ్లీ గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉందని వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరుతుల దీనికి వర్తిస్తాయని పేర్కొంది. అంటే ఆయన మాచర్ల వెళ్లేందుకు అనుమతి లేదు. నర్సరావుపేట దాటి వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదు.