మతం ఎదైనా పూజలు ఒక్కటే-బెజవాడ గుణదల చాలా స్పెషల్
ఫ్రాన్స్‌లోని లూర్థు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత విగ్రహం తరహాలోనే గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.
![మతం ఎదైనా పూజలు ఒక్కటే-బెజవాడ గుణదల చాలా స్పెషల్ ABP Desam Special Story On gunadala konda meri mata church In Vijayawada మతం ఎదైనా పూజలు ఒక్కటే-బెజవాడ గుణదల చాలా స్పెషల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/05/7c1908a7756a959c7ff6ed39fa37f0161664977757136215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తమిళనాడు వేళాంగిణి మాత చర్చి తర్వాత దేశంలోనే నెంబర్ 2గా మేరీ మాత చర్చి ప్రసిద్ది చెందింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ ఆలయంలో మతం ఎదైనా సరే అందరూ వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే, ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు పూజలు నిర్వహించుకోవటం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతుంటారు.
క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు గుణదలలోని మేరిమాత ఆలయానికి తరలి వస్తారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద క్షేత్రం విజయవాడ నగరంలోని గుణదల మేరీమాత చర్చి. ఫ్రాన్స్‌లోని లూర్థు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత విగ్రహం తరహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.
తమిళనాడు వేళాంగిణి మాత చర్చి తర్వాత మేరీ మాత చర్చి అనగానే గుణదలపైనే అందరి దృష్టి ఉంటుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. సాధారణ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో భారీగా రద్దీ ఉంటుంది. అంతే కాదు ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ మేరిమాత ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు.
గుణదల కొండ ఎలా ఏర్పడిందంటే...
1924లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో గుణదలలో సెయింట్ జోసఫ్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేశారు. దానికి రెక్టర్‌గా ఇటలీకి చెందిన ఫాదర్ పి. అర్లాటి నియుక్తులయ్యారు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో 1971లో పూర్తిస్థాయి చర్చిని నిర్మించారు. ఆలయానికి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథ బాలలు, క్రైస్తవ మత కన్యలు, క్యాథలిక్స్ ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ ఉత్సవాలు నిర్వహించేవారు.
1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కథలిక్‌లు, ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు.1946లో అప్పటి ఫాదర్ బియాంకి, జిప్రిడా, బ్రదర్ బెర్తోలి, ఎల్‌క్రిప్పా గుణదల కొండపై మరియమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మించతలపెట్టారు. ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలిచేందుకు సిద్ధమయ్యారు. అయితే 1947లో ఫాదర్ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అప్పుడు కురిసిన భారీవర్షానికి కొట్టుకు పోయాయి. అయినా సరే మిగిలిన ఫాదర్లు నిరుత్సాహపడలేదు. ఫాదర్ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తిచేశారు. 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా వ్యాపించడంతో ఆ ఒక్క సంవత్సరం మాత్రం ఉత్సవాలు జరగలేదు. మొన్నటి కరోనా కాలంలో రెండేళ్లపాటు ఉత్సవాలు నిర్వహించలేదు.
ఫిబ్రవరికి ప్రత్యేకత.
ఫ్రాన్సులోని లూర్థు నగరంలో ఉన్న కొండ అడవిలో సోబిరస్ అనే పధ్నాలుగేళ్ల బాలిక వంట కోసం కలప ఏరుకునేందుకు వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలిన ఉన్న ఒక మహిళ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. దీంతో ఇక్కడ గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి జనవరి 31న నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరపాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
కొండ పై శిలువ....
గుణదల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చిలను నిర్చించి, శిలువ వరకు మెట్లమార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రత తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్ష్రేతం రెక్టర్ చర్చి నుంచి గుహ వరకు ప్రార్థనలు నిర్వహిస్తారు.
కొండ పై మతసామరస్యం....
గుణదల కొండ అనగానే అందరికి మేరిమాత పేరు గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు ప్రార్థనలు చేసుకోవచ్చు. కొండకు వచ్చే భక్తులు ఏ మతానికి చెందిన వారైనా సరే వారి మతాలకు అనుగుణంగా ప్రార్థనలు చేసుకునే వీలుంటుంది. ఇక్కడ ఇదే స్పెషల్‌గా చెబుతుంటారు. భక్తులు తలనీలాలు సమర్పించటం, అగర్బత్తీలు, కొవ్వొత్తులు వెలిగించి పూజలు చేసుకోటం, వాహనాలకు పూజలు చేసుకోవటం ఇలా ఎవరి విశ్వాసాలకు అనుగణంగా వాళ్లు ప్రార్థనలు చేసుకొని స్వస్థత చేకూర్చుకుంటారని మత పెద్దలు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)