MPEDA Golden Jubilee : ఆక్వా కల్చర్ లో ఏపీ టాప్, దేశానికే ప్రాసెసింగ్ హబ్ - ఎంపెడా ఛైర్మన్ రఘవన్
MPEDA Golden Jubilee : మత్స్య సంపద ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉందని ఎంపెడా ఛైర్మన్ రాఘవన్ అన్నారు. మత్స్య సంపద ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన అన్నారు.
MPEDA Golden Jubilee : ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో నిలిచిందని, చేపల ఉత్పత్తిలో గత 7 దశాబ్దాలలో 18 రెట్లు పెరుగుదల సాధించామని మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ కె.ఎన్. రాఘవన్ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్ లో మంగళవారం ఎంపెడా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ సమావేశంలో "భారతదేశంలో విభిన్న జాతుల ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించడానికి ఎంపెడా ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్ లో - ప్రత్యామ్నాయ జాతుల పెంపకం " అనే అంశంపై సెమినార్ ను డాక్టర్ రాఘవన్ ప్రారంభించారు. రాఘవన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ దేశంలో మత్స్య సంపద ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపమని, విభిన్నమైన వనరులు, సామర్థ్యంతో ఈ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయంతో పాటు మత్స్య సంపద ఒక ముఖ్యమైన రంగంగా గుర్తించి ఈ దిశగా అభివృద్ధికి బాటలు వేశామన్నారు.
18 రెట్లు పెరిగిన మత్స్య సంపద
భారతదేశం చేపల ఉత్పత్తిలో గత 7 దశాబ్దాలలో 18 రెట్లు పెరిగిందని కెఎన్ రాఘవన్ అన్నారు. 1950-51 లో 0.75 మిలియన్ టన్నులు ఉన్న మత్స్య సంపద 2018-19 సంవత్సరం నాటికి 13.76 మిలియన్ టన్నులకు చేరుకోవడంతో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం ముందంజలో ఉందన్నారు. మత్స్య రంగంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా 15 మిలియన్ల ప్రజలకు జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఆక్వా కల్చర్ మొత్తం ఎగుమతుల్లో 35 శాతంతో ఏపీ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని రాఘవన్ అన్నారు. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీరప్రాంతం కలిగి 1.2 లక్షల హెక్టార్లలో ఆక్వా ఉత్పత్తి జరుగుతుందని ఆయన అన్నారు. 1.74 లక్షల హెక్టార్ల ఉప్పు నీటి ప్రాంతాలలో, 2.34 లక్షల హెక్టార్లు రిజర్వాయర్లు, సరస్సులలో, 28 వేల 200 హెక్టార్లు మాంగ్రో, చిత్తడి నేలలలో ఆక్వా ఉత్పత్తి జరుగుతుందని ఆయన అన్నారు.
విశాఖలోనే తొలి రొయ్యల హేచరీ
చేపల ఉత్పత్తికి సంబంధించి శాస్త్రీయ ఆక్వా కల్చర్ పద్ధతులను, సామర్థ్యానికి సంబంధించిన శిక్షణను, ఆక్వా కల్చర్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఎంపెడా పూర్తి సహకారాన్ని అందిస్తుందని రాఘవన్ అన్నారు. 1982లో మచిలీపట్నంలో ఆక్వా కల్చర్ ప్రమోషన్ కార్యాలయాన్ని, 2013 లో భీమవరంలో ఉప ప్రాంతీయ కేంద్రాన్ని, 2014లో నెల్లూరులో ఒక ఉపగ్రహ కేంద్రాన్ని స్థాపించి ఎంపెడా ద్వారా ఈ రంగానికి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. విశాఖపట్నంలో దేశంలోనే మొదటి రొయ్యల హేచరీ అయినా TASPARC ని ఎంపెడా ఏర్పాటు చేసి భారతదేశంలో రొయ్యల పెంపకం విప్లవానికి పునాది వేశామన్నారు. ఈ ఆక్వా ఫామ్ ఏర్పాటు తర్వాత దేశంలో 300లకు పైగా హేచరీల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యిందని అన్నారు. ఎంపెడా రొయ్యల హేచరీ నిర్వహణ, సీడ్ ఉత్పత్తుల్లో వందలాదిమంది మందికి శిక్షణను ఇచ్చి ప్రతి ఏడాది సరిపడా రొయ్యల సీడ్ ఉత్పత్తి చేసేందుకు ఈ అవకాశం కల్పించిందన్నారు.
ఏపీ ప్రాసెసింగ్ హబ్
ఆంధ్ర ప్రదేశ్ లో క్లస్టర్ ఫార్మింగ్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టి ఎంపెడా ద్వారా రైతులకు ఉత్తమ నిర్వహణా పద్ధతులపై శిక్షణ, సలహాలు అందిస్తున్నామని రాఘవన్ తెలిపారు. భారతదేశంలో ఏపీ ప్రాసెసింగ్ హబ్ మారుతుందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యల పెంపకం, పునరుద్ధరణ, ఎల్ వనామా విస్తరణ, మడ పీత, సీబాస్, గిఫ్ట్, కోజియా జాతుల పరిచయం ద్వారా ఆక్వా కల్చర్ ను వైవిధ్య పరిచే కార్యక్రమాలను ఎంపెడా చేపట్టిందని రాఘవన్ అన్నారు.