KVP On CM Jagan : బీజేపీకి దగ్గరైన జగన్ ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారు, కేవీపీ సంచలన వ్యాఖ్యలు
KVP On CM Jagan : బీజేపీకి దగ్గరైన సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ విమర్శలు చేస్తున్నారు.
KVP On CM Jagan : ఏపీలో వైఎస్ఆర్సీపీ పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆదివారం విజయవాడలో కాంగ్రెస్ సమన్వయ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేవీపీ సీఎం జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాల్లో సీఎం జగన్ కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని, విమర్శించకూడదని 1996లో వైఎస్, తాను నిర్ణయించుకున్నామని కేవీపీ తెలిపారు.
బీజేపీకి దగ్గరవుతున్న జగన్
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో ఉందని, కానీ టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కోసం నిర్మాణ బాధ్యతలు తీసుకోవడాన్ని కేవీపీ తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యంగా ఉండేదన్నారు. ఏపీ విభజన అంశాలను నెరవేర్చడానికి జగన్ ప్రయత్నించలేదని ఆరోపించారు. బీజేపీకి దగ్గరైన జగన్ ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కేవీపీ ఆవేదన చెందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తే 2024లో కాకపోయినా 2029 నాటికైనా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందన్నారు.
చివరి వరకూ కాంగ్రెస్ తోనే
వైఎస్ఆర్, తనకు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చిందని కేవీపీ రామంచంద్రరావు గుర్తుచేశారు. 1978 నుంచి వైఎస్ఆర్ కు కాంగ్రెస్ అనేక పదవులు కట్టబెట్టిందన్నారు. అలాంటి పార్టీని ఎప్పటికీ వీడకూడదని అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని 1996లోనే తామిద్దరం ఒట్టేసుకున్నామన్నారు. తాను చివరిదాకా కాంగ్రెస్ తోనే ఉంటానని కేవీపీ స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ కు కేపీపీ అత్యంత ఆప్తులు. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎంపీగా కేవీపీ ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరోసారి ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన కేసీపీ... జగన్ కాంగ్రెస్ నుంచి విడిపడి కొత్త పార్టీని పెట్టుకున్నా ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సీఎం జగన్ కు సాయం చేస్తున్నారని కేవీపీ విమర్శలు లేకపోలేదు. అయితే తాజాగా కేవీపీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కు సన్నిహితుడైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి హాజరైన కేవీపీ ఆ తర్వాత సీఎంను కలవలేదు. కానీ హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ నిర్వహించిన సదస్సులో కేవీుపీ పాల్గొన్నారు. ఏపీకి పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను ఏర్పాటు చేసిన ఏఐసీసీ కేవీపీ రామచంద్రరావు కీలక బాధ్యతలు అప్పగించింది.