Union Minister Pemmasani: ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం- ఏపీకి కేంద్ర మంత్రి పెమ్మసాని సరికొత్త నిర్వచనం
Pemmasani Chandrasekhar: ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి కట్టుబడి ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
Union Minister Pemmasani Chandrasekhar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇస్తుందని ఎవరూ ఊహించలేదని కేంద్రమంత్రి అన్నారు. అలాగే ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఏపీ అంటే కొత్త అర్థం చెప్పారు కేంద్రమంత్రి పెమ్మసాని. ఏ అంటే రాజధాని అమరావతి (Amaravati) అని, పీ అంటే పోలవరం (Polavaram Project) అని రాష్ట్రానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై గుంటూరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఏపీకి అధిక ప్రాధాన్యం
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024లోనూ ఏపీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారని పెమ్మసాని తెలిపారు. అమరావతికి రూ. 2,500 కోట్లతో రైల్వేజోన్ మంజూరైందని అన్నారు. రూ.12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పుకొచ్చారు. దీనికి అవసరమైన భూ సేకరణకు కేంద్రం సహకరిస్తోందన్నారు. వెనకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను కూడా కలిపి... ఆయా జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి రెండు మేజర్ పారిశ్రామిక కారిడార్లు రానున్నాయని ప్రకటించారు. వివిధ ప్రాజెక్టుల రూపంలో దాదాపు రూ. 80 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు.
తప్పుడు ప్రచారం
కేంద్ర ప్రభుత్వం అమరావతికి కేటాయించిన నిధులను అప్పు అని గిట్టని వాళ్లు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రానికి బయట ఎక్కడా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల నిధులను రాబట్టి ఈ ఐదు సంవత్సరాలలో అమరావతిని అభివృద్ధి చేసి, పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: YS Sharmila: సిగ్గు సిగ్గు జగన్! ఇంత పిరికితనం, చేతకానితనమా - వైఎస్ షర్మిల సంచలనం
అత్యధిక మెజార్టీతో గెలిచి..
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిగా గెలుపొందిన డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ఎన్డీయే ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖను కేటాయించారు. ఆయన ఆ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ 3.4 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీల్లో పెమ్మసాని ఒకరు.