TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్- ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల తేదీలు ఇవే
TTD News: భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం నవంబరు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.
TTD News: భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం నవంబరు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా నవంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వెబ్‌సైట్లను నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.
ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను విడుదల చేసే ముఖ్యమైన తేదీలు ఇవే
- కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
- వర్చువల్ సేవా టికెట్లు ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయి.
- ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
- శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
- వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయి.
- ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
- తిరుమల, తిరుపతిలలో వసతి గదుల బుకింగ్ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టు 24న తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవాలు
ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం ఆగస్టు 24వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలోని తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలనంబి ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు.
రోగులకు ప్రేమతో సేవలందించండి
స్విమ్స్‌కు వచ్చే రోగులకు డాక్టర్లు ప్రేమతో, నిబద్ధతతో సేవలు అందించాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. స్విమ్స్ డైరెక్టర్ సదా భార్గవి ఐఏఎస్ ఏర్పాటు చేసిన డాక్టర్లతో సమావేశానికి ఈవో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోగులు భగవంతుని తరువాత డాక్టర్లను భగవత్ స్వరూపులుగా భావిస్తారన్నారు. డాక్టర్లు రోగులకు చక్కగా సేవలు అందించాలని, స్విమ్స్ అభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు.
తిరుపతిని ఒక మెడికల్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. బర్డ్, ఆయుర్వేద, చిన్న పిల్లల ఆసుపత్రుల పనితీరు మెరుగుపడిందని, అదే స్థాయిలో స్విమ్స్ ఆసుపత్రి మరింత మెరుగ్గా పనిచేసేందుకు డాక్టర్లు ప్రణాళిక బద్ధంగా పనిచేయాల్సి ఉందన్నారు. స్విమ్స్‌లోని డాక్టర్లు ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నారని, విభాగాల వారీగా వారికి అవసరమైన సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు టీటీడీ అందిస్తుందని తెలిపారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అంతర్గత సమావేశాలు నిర్వహించాలని, డైరెక్టర్ నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ వందలాది కోట్లు ఖర్చు చేస్తు చేస్తోందన్నారు. అదేవిధంగా ఈ ఆసుపత్రికి వచ్చే రోగులను తమ పిల్లలుగా భావించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఈవో సూచించారు.