Yogandhra: సూర్యనమస్కారాల్లో గిన్నిస్ రికార్డు - గిరిజన విద్యార్థుల ఘనత
Yogandhra: సూర్య నమస్కారాల్లో గిన్నిస్ రికార్డును గిరిజన విద్యార్థులు నెలకొల్పారు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసిన 25వేల మంది గిరిజన విద్యార్థులు అబ్బుర పరిచారు.

Tribal students set Guinness record: ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ రోజు మన గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దాదాపు 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ఇదొక వరల్డ్ రికార్డ్. దీనిని శనివారం ప్రకటిస్తారు. ఇది మనం గర్వపడాల్సిన విషయం అని నారా లోకేష్ అన్నారు. యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిందని, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నెల 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డ్ సృష్టించేలా 25 వేల మంది అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ రోజు గిరిజన విద్యార్థులను చూస్తుంటే నాకు గుర్తుకువచ్చేది కమిట్ మెంట్, పట్టుదల. 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు మీరు ఆనాడు చేసినప్పుడు మేం అందరం ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపుతో మీరంతా కష్టపడి దేశంతో పాటు ప్రపంచం మనవైపు చూసేలా చేశారని ప్రశంసించారు.
యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో యోగా చేపించేవారు. ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని. ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను. అదే క్రమశిక్షణ, పట్టుదల మీ అందరిలో ఉంది. దీనిని మరువొద్దు. ఏ ఆశయాల కోసం మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాల కోసం నడవండి. విజన్ తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. మనం అందరం కలలు కనాలి. మన కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశాన్ని మార్చాలనే కలలు కనాలి. అందుకోసం కష్టపడి పనిచేయాలి. పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయం పెట్టుకున్నామో దానిని సాధించాలని కోరుతున్నా. మంత్రి సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. ఏ పట్టుదలతో విద్యార్థులు సూర్యనమస్కారాలు చేశారో మా అందరిపై బాధ్యత పెరిగిందన్నారు.
జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ దినేష్ కుమార్ గారిని కూడా నేను అభినందిస్తున్నా. ఏడాది కాలంగా విద్యార్థులతో అద్భుతంగా ప్రాక్టీస్ చేయించారు. మాస్టర్ గారు కూడా పట్టుదలతో శిక్షణ ఇచ్చారు. ఆంధ్రులుగా మన కోరికలన్నీ గౌరవ ప్రధాని గారు తీరుస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపారు. విశాఖకు రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన ప్రజారాజధాని అమరావతి పనులు ప్రారంభించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎన్టీపీసీ లాంటి సంస్థలు కావాలని అడిగితే ఇచ్చారు. ఏపీ అన్నా, విశాఖ అన్నా ప్రధాని గారికి చాలా ప్రేమ. ఏడాదిలో రెండో సారి ప్రధాని విశాఖ వస్తున్నారు. ఆయనకు ఒక కానుకగా ఈ రోజు మనం అందరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామన్నారు.





















