Banakacharla Issue: చంద్రబాబు వల్లే బనకచర్ల వివాదం -ఏపీతో చర్చలకు రెడీ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Babu Talks:బనకచర్లపై ఏపీతో చర్చలకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తీరు వల్లే వివాదం ప్రారంభమయిందన్నారు.

Talks On Banakacharla Project: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బనకచర్ల విషయంలో నేరుగా కేంద్రం వద్దకు వెళ్లి అనుమతుల కోసం ప్రయత్నించడం వల్లనే వివాదం ప్రారంభమయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణతో చర్చించకుండా .. బనకచర్ల ప్రాజెక్టుపై నేరుగా కేంద్రగానికి ప్రైమరీ ఫీజుబులిటీ రిపోర్టు ఇచ్చారని రేవంత్ అన్నారు. కూర్చుని చర్చించుకుంటే సమస్య ఉండదన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు అక్కడి మీడియాతో రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దిగువ రాష్ట్రంగా ఏపీకి హక్కులు ఉన్నాయని అంటున్నారని ఏపీకి ఉన్న హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయని తెలంగగాణ సీఎం గుర్తు చేశారు.
బనకచర్లపై కూర్చుని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 23వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అన్నీ చర్చిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక అడుగు ముందుకు వేసి మేమే ఏపీని చర్చలకు పిలుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్లకు బీజం పడిందని స్పష్టం చేశారు. బనకచర్ల నీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు బనకచర్లకు బీజం పడిందన్నారు. ఏపీలో చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ గెలవాలంటే.. గోదావరి నీళ్లపై రాజకీయం చేయాలన్నారు. అందుకే ఈ రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ చచ్చిపోయిందని ఇప్పుడు గోదావరి , బనకచర్లను అడ్డు పెట్టుకుని మరోసారి బతికేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
పేర్లు, ఊర్లు, అంచనాలు మారితే.. వారు చెప్పినట్లుగా అవదని.. బీఆర్ఎస్ హయాంలోనే.. దీనికి బీజం పడిందన్నారు. 2016, 2018లో ఏపీ ప్రభుత్వం రెండు జీవోలు ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ జీవోల ఆధారంగా వ్యాప్కోస్ 15పేజీల నివేదిక తయారు చేసిందన్నారు. గోదావరి-పెన్నా అనుసంధానంలో బనకచర్ల ఓ భాగమని రేవంత్ తెలిపారు. నాలుగు వందల టీఎంసీలు తరలించేందుకు అప్పుడే ప్రాజెక్టును డిజైన్ చేశారన్నారు. ఇప్పటికైనాన బనకచర్ల విషయంలో కూర్చుకుని మాట్లాడుకుంటే సమస్య ఉండదన్నారు. ఇప్పటికే సీఎంల స్థాయిలో ఓ సారి సమావేశం అయ్యామని రేవంత్ గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఇటీవలి కాలంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. దిగువ రాష్ట్రమైన ఏపీ.. తాము సముద్రంలోకి వెళ్తున్న నీటిని మళ్లించుకుంటామని ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. కేంద్రం సగం నిధులు గ్రాంట్ గా..మరో సగం నిధులు అప్పుగా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. . ప్రైమరీ ఫీజుబులిటీ రిపోర్టును కూడా సమర్పించారు. దీంతో తెలంగాణలో వివాదం ప్రారంభమయింది.. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీ మళ్లించుకుంటోందని.. సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.. కేంద్ర నేతల్ని కలిసి... బనకచర్లకు అనుమతి ఇవ్వవొద్దని కోరారు. ఈ లోపు చంద్రబాబును చర్చలకు పిలుస్తానని రేవంత్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఏపీ కూడా చర్చలకు వచ్చే అవకాశంఉంది.





















