AP News Developments Today: నేడు నర్సీపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, షెడ్యూల్ ఇదీ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
AP News Developments Today: సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబరు 30) నర్సీపట్నంలో పర్యటించనున్నారు. నర్సీపట్నంలో ప్రభుత్వం నిర్మించనున్న మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జోగినాధపాలెంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
టీడీపీ, జనసేన కార్యకర్తల అరెస్టులపై లోకేష్ ఖండన
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. అరెస్ట్ చేసిన ప్రతిపక్ష పార్టీల వారిని వెంటనే విడుదల చెయ్యాలని ముఖ్యమంత్రిని అడ్డుకోవాల్సిన అవసరం తమకు ఏ కోశానా లేదని లోకేష్ అన్నారు. చెత్త పరిపాలన, అసమర్థ ముఖ్యమంత్రి అంటూ వైసీపీకి చెందిన సొంత సామాజిక వర్గం నేతలే తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నేతల అరెస్టులు మాని సీఎం పర్యటనలు ఉన్నప్పుడు వైసీపీ నేతల్ని అరెస్ట్ చెయ్యాలని పోలీసులను తాను ప్రత్యేకంగా కోరుతున్నట్లు చెప్పారు. ఎందుకంటే చెత్త పరిపాలనపై
వళ్లు మండిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఆయన్ని అడ్డుకుని నిలదీసే అవకాశం ఉందని లోకేష్ తెలిపారు.
విశాఖలో రాఘవరావు వ్యవహారంపై జనసేన ప్రెస్ రిలీజ్
రాఘవ రావు కు జనసేన పార్టీలో ఎలాంటి బాధ్యతలుగానీ, క్రియాశీలక సభ్యత్వంగానీ లేవు. ఇటువంటి నేరపూరిత చర్యల్లో ఉన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరుతున్నాం. పార్టీ ముఖ్యులతో ఎందరో ఫోటోలు తీయించుకున్నంత మాత్రాన వారు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్టు కాదు. రాఘవరావు కొద్ది రోజుల ముందు వరకూ వైసీపీలో ఉన్నారని గమనించగలరు’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు ఓ ప్రకటనలో తెలిపారు.
నేడు నెల్లూరులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడి మూడో రోజు పర్యటన జరగనుంది. చంద్రబాబు సభ జరిగే ట్రంకురోడ్డులోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్‌ను, రాత్రికి బస చేసే బృందావనం హౌసింగ్ కాలనీ కల్యాణమండపం ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ చేట్టాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు, ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గూటూరు మురళీకన్నబాబు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, చెంచలబాబు యాదవ్, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, బండారు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తుంటారు.. గురువారం రోజున 67,156 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 24,752 మంది తలనీలాలు సమర్పించగా, 4.92 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనంకు 26 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.