BVSN Prasad Joins Janasena: జనసేనలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ (SVCC) ద్వారా తెలుగులో పలు విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు.
BVSN Prasad Joins Janasena Party: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ (SVCC) ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రసాద్ ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలు పంచుకున్నారు.
యాగశాలలో ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించుకున్న అనంతరం కార్యాలయంలోనే ఉన్న పవన్ కళ్యాణ్ తో కాసేపు ముచ్చటించారు. పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఎదుట వ్యక్తపరిచారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన జనసేనాని పవన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ అన్నారు.
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు.#2DaysToVarahiYatra#JanaSena pic.twitter.com/cMGZVI3KkB
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
జనసేన కేంద్ర కార్యాలయంలోని యాగశాలను సందర్శించిన సినీ ప్రముఖులు
ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన యాగ క్రతువులో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు సోమవారం పాలు పంచుకున్నారు. మైత్రి మూవీస్ నుంచి వై.రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్మంట్ నుంచి డీవీవీ దానయ్య, మెగా సూర్యా ప్రొడక్షన్ నుంచి ఏఎం రత్నం, ఎస్వీసీసీ నుంచి బీవీఎస్ఎన్ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి శ్రీ వివేక్ కూచిభొట్లతోపాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ లు యాగశాలకు విచ్చేసి అక్కడ ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించారు. యాగక్రతువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని అభిలషించారు. అక్కడే ఉన్న రుత్వికులతో యాగ విశిష్ఠత ను అడిగి తెలుసుకున్నారు. మహా యాగ నిర్వహణా నిమిత్తం వేద మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల వద్ద ఉంచిన మంత్ర కళశాలకు నమస్కరించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
వారాహిపై సమర సాహసి
యాగశాలలో శాస్త్రోకంగా పూజల అనంతరం నిర్మాతలు, దర్శకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. కార్యాలయంలోనే ఉన్న వారాహి రథం గురించి అడిగారు. దర్శకనిర్మాతలను పవన్ తన వారాహి రథం వద్దకు తీసుకెళ్లారు. వారాహి ప్రచార రథం వివరాలు తెలిపారు. వారాహి రథం లోపలికి తీసుకెళ్లి చూపించారు. విజయాలనందించే వారాహి రథంపై సమరాన్ని ఆరంభించే సాహసి వస్తున్నాడని, ఆయనకు విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
యాగ ఫల సిద్ధిరస్తు..!
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని యాగశాలను సందర్శించిన సినీ ప్రముఖులు#2DaysToVarahiYatra pic.twitter.com/dQghKQHCx4
నవశకానికి నాంది పలికే యాత్ర
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించే గొప్ప యాత్ర కావాలన్నారు. ప్రజా క్షేమం కాంక్షిస్తూ చేస్తున్న యాగక్రతువులో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, వారాహి యాత్ర సైతం రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లోనే రాణించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిచిపోలేని నాయకుడు కావాలంటూ యాత్రకు సంసిద్ధమవుతున్న జనసేనానికి శుభాభినందనలు తెలిపారు.