TollyWood Meet : ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌కు టాలీవుడ్ ఓకే ! పేర్ని నానితో భేటీలో కీలక నిర్ణయాలు
ప్రభుత్వ ఆన్ లైన్ టిక్కెట్ పోర్టల్‌కు టాలీవుడ్ అంగీకారం తెలిపింది. టాలీవుడ్ ప్రముఖులతో పేర్ని నాని సమావేశం అయ్యారు. టాలీవుడ్ సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని పేర్ని నాని హామీ ఇచ్చారు.
ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మడానికి సినీ పరిశ్రమ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ పరిశ్రమ బృందం సమావేశం అయింది. ఈ సందర్భంగా టిక్కెట్ల ఆన్‌లైన్ అమ్మకాలపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు చెప్పారు. అలాగే సినీ రంగ సమస్యలపైనా చర్చించారు. ఈ సమావేశానికి నిర్మాతలు ఆదిశేషగిరిరావు, సి.కల్యాణ్‌లతో పాటు ధియేటర్లకు సంబంధించిన వారు కూడా పాల్గొన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం సినీ పరిశ్రమలో ఉంది. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. Also Read : ఇలియానాకు ఛాన్స్ దక్కుతుందా..?
ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి సమావేశంలో సినిమా పరిశ్రమ వారికి వివరించామని మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభిస్తుందని ప్రకటించారు. ప్రజలెవరూ ప్రశ్నించకుండా పారదర్శకత కోసమే టిక్కెటింగ్ పోర్టల్ తెస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలతో మాత్రమే టిక్కెట్లను అమ్మాలని...ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు అనేక విషయాలను తమ దృష్టికి తీసుకొచ్చారని వారి విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యమైనంత మేర సానుకూలంగా స్పందిస్తామని పేర్ని నాని తెలిపారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో అభిమానం ఉందని పేర్ని నాని తెలిపారు. Also Read : నాగార్జున ఇంటికి షిఫ్ట్ అయిన చైతూ?
ధియేటర్లకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆదిశేషగిరిరావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. పెరిగిపోయిన ఖర్చులకు అనుగుణంగా టిక్కెట్ రేట్లు ఉండాలని కోరినట్లుగా తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్‌రెడ్డి చిత్ర పరిశ్రమకు ఏవిధంగా సాయం చేశారో అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరినట్లుగా తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ కావాలని తామే అడిగామని మరో నిర్మాత సీ. కల్యాణ్ మీడియాకు తెలిపారు. కొత్తగా విడుదలయ్యే సినిమాల బెనిఫిట్ షో కోసం అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం తప్పకుండా అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు. అయితే ప్రెస్‌మీట్‌లో మాత్రం పేర్ని నాని బెనిఫిట్ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదని స్పష్టం చేశారు. Also Read : ఆసుపత్రిలో అడివి శేష్, డెంగ్యూ సోకడంతో ప్లేట్ లెట్స్ డౌన్
మామూలుగా 20వ తేదీన సినీ పరిశ్రమ ప్రముఖులతో సీఎం జగన్ సమావేశం అవుతారన్న ప్రచారం జరిగింది. అయితే పేర్ని నాని కొంత మంది నిర్మాతలు, ధియేటర్ యజమానులతో మాత్రమే సమావేశం అయ్యారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థపై సినీ పరిశ్రమ అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్నారన్న విమర్శల నేపధ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ సమావేశం ఆ అభిప్రాయం అధికారికం కావడంతో ఇక ప్రభఉత్వ పోర్టల్ ప్రారంభించడం లాంచనమేనని చెబుతున్నారు.