(Source: ECI/ABP News/ABP Majha)
Loksabha Chandrababu : లోక్‌సభలో చంద్రబాబుపై తృణమూల్ ఎంపీ ఆరోపణలు - స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన బైరెడ్డి శబరి
Byreddy Sabhari: లోక్ సభలో చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపణలు చేశారు. ఆయనపై ఈడీ, సీబీఐ కేసుల విచారణ జరగడం లేదన్నారు. అయితే కల్యాణ్ బెనర్జీ బైరెడ్డి శబరి గట్టి సమాధానం ఇచ్చారు.
TMC MP Kalyan Banerjee made allegations against Chandrababu : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఏపీ సీఎం చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సమయంలో పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ స్కాం జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భార్యకు చెందిన కంపెనీకి షేర్ల విలువ ఐదు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెరిగిపోయిందన్నారు. కానీ విచారణకు ఆదేశించలేదని ఆరోపించారు. అలాగే.. చంద్రబాబు నాయుడిపై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల్లో విచారణ ఆగిపోయిందన్నారు. ఎందుకంటే.. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఎలాంటి విచారణలు జరగవని మండిపడ్డారు.
ఎంపీ కల్యాణ్ బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో సభలో లేని చంద్రబాబుపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని అడ్డు చెప్పినా ఆయన తగ్గలేదు. ఆరోపణలు చేసుకుంటూ పోయారు. తర్వాత ఈ అంశంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు. చంద్రబాబుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టించారన్నారు. చంద్రబాబుపై ఒక్క సీబీఐ,ఈడీ కేసు కూడా లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో సీఐడీని ఉపయోగించి అక్రమ కేసులు పెట్టించారని.. ఈ వషయం ప్రజలు గుర్తించే జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీని ఘోరంగా ఓడించారన్నారు. కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ఈడీ, సీబీఐ చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని, ఆ రెండు సంస్థలతో కేంద్రప్రభుత్వం చంద్రబాబును బెదిరించిందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అవి పూర్తిగా అవాస్తవమని.. టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై సీఐడీతో అక్రమ కేసులు పెట్టించిందని, తన సొంత నియోజకవర్గం నంద్యాలలోనే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 164 చోట్ల గెలిచిందన్నారు. 25 లోక్‌సభ సీట్లలో 21 సీట్లను గెలుచుకుందని తెలిపారు. అవగాహన రాహిత్యంతో కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం క్లచ్ టీడీపీ, జేడీయూ చేతిలో ఉందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారని.. కానీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమన్వయంతో కేంద్రప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మరోవైపు వైసీపీ గత ఐదేళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేసిందన్నారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిందని.. వైసీపీ పాలనలో యువత బెగ్గింగ్ చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని, శ్రామికులు ఆకలి చావులు చస్తున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థతి ఏర్పడిందన్నారు ఎంపీ శబరి. ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారన్నారు. బైరెడ్డి శబరి స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.