MLA Kolikapudi Srinivasarao: వర్షంలో నడిరోడ్డుపై గుంతలో కూర్చొని టీడీపీ ఎమ్మెల్యే నిరసన - ఎందుకో తెలుసా?
Andhrapradesh News: అధికారుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వినూత్నంగా నిరసన తెలిపారు. తిరువూరు పట్టణంలో రోడ్ల మరమ్మతులు చేపట్టడం లేదని గుంతలో కూర్చొని నిరసన చేశారు.
MLA Kolikapudi SrinivasaRao Protest On The Road: టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolilapudi Srinivasa Rao) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వర్షంలో తడుస్తూ గుంతల రోడ్డుపై స్టూల్ వేసుకుని కూర్చున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు (Tiruvuru) పట్టణంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ సమీపంలో ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచి ఉండడంతో వర్షంలో గంట పాటు నిలబడి ఆర్అండ్‌బీ అధికారుల తీరుపై నిరసన తెలిపారు. గతంలో రోడ్ల గురించి పట్టించుకోలేదని.. ఇటీవల వర్షాలకు రోడ్లకు గుంతలు పడ్డాయని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. కాగా, ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
అధికారుల వివరణతో..
ఎమ్మెల్యే నిరసన సమాచారం అందుకున్న ఆర్అండ్‌బీ ఏఈ గాయత్రి అక్కడకు వచ్చి ఆయనకు పరిస్థితి వివరించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. రోడ్ల మంజూరుకు విడుదలైన నిధులు గురించి అడిగి తెలుసుకున్నారు. రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.96 కోట్లు మంజూరు చేసిందని.. టెండర్ పూర్తి చేసి గుత్తేదారుకు వర్కర్ ఆర్డర్ జనవరిలో ఇచ్చామని ఏఈ ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎన్నికల కోడ్ కారణంగా పనులు ఆగిపోయాయని చెప్పారు. వర్షాకాలం పూర్తైతే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కనీసం రోడ్లపై గుంతల వరరైనా మరమ్మతులు చేసి తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఏఈకి సూచించి నిరసన విరమించారు.
కాగా, ఇదే ఎమ్మెల్యే కొలికపూడి ఇటీవలే ఓ వైసీపీ నేత భర్త అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని దాన్ని పొక్లెయిన్‌తో పాక్షికంగా కూల్చేశారు. జిల్లాలోని ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి భర్త అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని ముగ్గురు బాధితులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా ఆ స్థలాన్ని పరిశీలించి.. పొక్లెయిన్, బుల్డోజర్‌తో పాక్షికంగా కూల్చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే, తమ భవనం అక్రమంగా కూల్చేశారని వైసీపీ ఎంపీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి.. 'నా పదవి శాశ్వతం కాదు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు' అంటూ ఫేస్ బుక్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు.
సీఎంకు వివరణ
కాగా, దీనిపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడిని పిలిపించి మాట్లాడారు. 'దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం తప్ప వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో వెళ్లొద్దు' అంటూ ఎమ్మెల్యేకు సూచించారు. కొంతమంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే తాను క్షేత్రస్థాయిలో వెళ్లాల్సి వచ్చిందని జరిగిన ఘటనపై సీఎంకు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.