Chevireddy Bhaskar Reddy Arrest: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్
Andhra Pradesh News | ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు.

AP Liquor Scam Case | చంద్రగిరి: ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఏ 38)ని మంగళవారం సిట్ అరెస్ట్ చేసింది. చెవిరెడ్డి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు(ఏ 34) సైతం అరెస్ట్ అయ్యారు. వీరిద్దరిని విజయవాడ సిట్ కార్యాలయంకు తీసుకొచ్చి, అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరు పరచనున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి పై ఇదివరకే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరూ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం ఉదయం వీరిని అడ్డుకున్నారు. ఏపీ పోలీసులకు సమాచారం అందించగా, బెంగళూరు వెళ్ళిన సిట్ బృందాలు మంగళవారం రాత్రి చెవిరెడ్డి తో పాటు వెంకటేష్ నాయుడు అరెస్ట్ చేశారు. దాంతో లిక్కర్ స్కామ్ కేసులు అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి భారీ మొత్తం
వైసీపీ హయంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి కలెక్ట్ చేసిన నగదును రాజ్ కసిరెడ్డి అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేసేవారు. చెవిరెడ్డి చెప్పడంతో ఆయన సిబ్బంది హైదరాబాదు, బెంగళూరులోని పలు ప్రాంతాలకు వెళ్లి ఆ సొమ్మును తీసుకొచ్చేవారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు మొత్తం 250 నుంచి 300 కోట్ల వరకు చెవిరెడ్డి చేతికి చేరాయని సిట్ భావిస్తోంది. చెవిరెడ్డికి చేరిన సొమ్మును ఐదు జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. ఆ నగదును వారు ఓటర్లకు పంపిణీ చేసి ప్రభావితం చేశారు. ఆ నగదు వ్యవహారాన్ని తరలించడం దాచడం చేసింది వెంకటేష్ నాయుడు అని' సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.
కొత్తగా ఆరుగుర్ని నిందితులుగా చేర్చిన సిట్
కేసులో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ఏ 34, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ 38, రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఏ 39 సహా మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చింది సిట్. ఈ మేరకు కోర్టులో మంగళవారం మెమో దాఖలు చేశారు. ఏ 35 బాలాజీ యాదవ్ చెవిరెడ్డికి ప్రధానా అనుచరుడు. గతంలో అతడు తుడాలో పనిచేశాడు. ఏ 36 నవీన్ రెడ్డి చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు. రాజ్ కసిరెడ్డి నుంచి సొమ్మును చెవిరెడ్డికి చేరవేయడంలో ఇతడికిలకంగా వ్యవహరించాడు. ఏ 37 గా ఉన్న హరీష్ చెవిరెడ్డి డ్రైవర్. నవీన్ తో పాటు వెళ్లి రాజ్ కసిరెడ్డి నుంచి నగదు తీసుకొచ్చాడు అని సిట్ అధికారులు తెలిపారు.
చెవిరెడ్డి మాజీ గన్ మెన్ ఆరోపణలు
చెవిరెడ్డి దగ్గర గన్‍మెన్‍గా పనిచేసిన AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ సహా పలువురికి లేఖ రాశారు. లిక్కర్ కేసులో తాము చెప్పిన వివరాలు రాసి సంతకం చేయాలని సిట్ అధికారులు తనను ఒత్తిడి చేశారని లేఖలో ఆరోపించారు. విచారణకు యూనిఫాంలో వెళ్తే తనను తిట్టారని, లిక్కర్ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉందని చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. తాను అందుకు అంగీకరించకపోవడంతో తనపై సిట్ అధికారులు దాడి చేశారని ఆరోపించారు. మదన్ రెడ్డి లేఖ, వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. విచారణలో తమకు సహకరించకపోవడంతో పాటు మీ పేర్లు రాసి చనిపోతానని సిట్ అధికారులనే మదన్ రెడ్డి బెదిరించాడని తెలిపారు.






















