TTD Decisions: తిరుమల నడకమార్గంలో ప్రతి భక్తుడికి ఊతకర్ర- టీటీడీ కీలక నిర్ణయాలు ఇలా
TTD To give hand stick to Devotees: అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
TTD To give hand stick to Devotees:
తిరుపతి : అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. చిరుత సంచారం, దాడులు జరుగుతున్న కారణంగా నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నిర్వహించిన హై లెవెల్ కమిటీ సమావేశం ముగిసింది. నెలన్నర కిందట నడక దారిలో కౌశిక్ అనే బాలుడిపై జరిగిన చిరుత దాడి గానీ, లక్షితపై జరిగిన చిరుత దాడి చేసి చంపివేయడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు.
భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్య అటవీ శాఖ అధికారులతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సమావేశం అయ్యారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను (12 ఏళ్లలోపు వారిని) అనుమతించేది లేదు. రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుంది.
ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వనున్న టీటీడీ
నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకే అనుమతిస్తామన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖా సిబ్బందిని నియమించేందుకు సిద్ధమన్నారు. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నడక మార్గం, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నడక మార్గంలో ఉన్న హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు వేయకుండా నిరోధిస్తే చర్యలు తప్పవన్నారు.
దాదాపు ఐదు వందల ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తన్నాం. అవసరం అయితే డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్. అవసరం అయితే నడక దారిలో ఫోకస్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని, ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ శాఖా అధికారుల నుంచి సలహా అడిగామన్నారు. కేంద్ర అటవీ శాఖ అధికారులకు ఫెన్సింగ్ ఏర్పాటుపై చర్చిస్తాం. అలిపిరి, ఏడోవ మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకు అలర్ట్..
భక్తుల ప్రాణరక్షణే ప్రథమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని చైర్మన్ భూమన చెప్పారు. 2007లో కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు 15 వేల మందికి ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నామని తెలిపారు. దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు ఏవిధంగా నైనా తిరుమలకు చేరుకోవచ్చు అన్నారు. వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టే వరకూ ఇదే నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు. వన్యప్రాణుల అధ్యాయనం కోసం అటవీ శాఖా అధికారులకు టీటీడీ అన్ని విధాలుగా సహకరిస్తాం.. ప్రతినిత్యం భక్తులు సురక్షితంగా తిరుమలకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ హైలెవెల్ మీటింగ్ అనంతరం ఈ విషయాలు వివరించారు.