Sarva Darshan Tickets: శ్రీవారి భక్తులకు నిరాశే.. 8 నిమిషాల్లోనే తిరుమల సర్వదర్శనం టోకెన్ల బుకింగ్ పూర్తి..
TTD Sarva Darshan Tickets: ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లో శనివారం విడుదల చేసింది. కేవలం 8 నిమిషాల్లోనే టోకెన్లు పూర్తవడంతో భక్తులకు నిరాశ తప్పలేదు.
Tirumala Sarva Darshan Tickets: తిరుపతి : తిరుమల వెంకన్న దర్శనానికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్19 వ్యాప్తి నేపధ్యంలో ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులను మాత్రమే కొండకు అనుమతిస్తొంది టీటీడీ. అయితే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం, ఆర్జిత సేవ టిక్కెట్లను జియో క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా టీటీడీ అధికారి వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను అందుబాటులో ఉంచుతుంది.
అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లో ప్రతి నెల విడుదల చేస్తుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ శనివారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఉచిత సర్వదర్శనం టోకెన్లను విడుదల చేసింది. ఇలా విడుదల చేయడం అలా సర్వదర్శనం టిక్కెట్లు అన్ని హాట్ కేకులా బుక్ అయిపోయాయి. ఫిబ్రవరి మాసంలో 15 తేదీ వరకూ మొత్తంతో లక్షన్నర సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్లో టీటీడీ విడుదల చేసింది. కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి కావడంతో టోకెన్లు పూర్తయిన విషయం తెలియక ఇంకా వేలాదిగా టీటీడీ సైట్ లో భక్తులు లాగిన్ అయ్యి టిక్కెట్ల కోసం చూస్తున్నారు.
భక్తులకు తప్పని నిరాశ..
టిక్కెట్ల కోటా పూర్తి కావడంతో భక్తులకు నిరాశ తప్పడం లేదు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భక్తులు టోకెన్లు పోందలేక పోతున్నారనే ఉద్దేశంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియను టీటీడీ ప్రారంభించనుంది. సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వుండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా, కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది.. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నందు వల్ల వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే టీటీడీ జారీ చేసింది.
ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశంపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. ఏదీ ఏమైనప్పటికీ త్వరలో సామాన్య భక్తులకు ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శన టిక్కెట్లను అందించడంను భక్తులు స్వాగతిస్తున్నారు.
Also Read: వారంలో ఈ రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు సిద్ధిస్తాయట...