TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Srivani Trust Cancelled | తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అన్య మతస్తులను తీసుకోరాదని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
TTD Decision To cancel Srivani Trust in Tirumala | తిరుపతి: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Board) నిర్ణయం తీసుకుంది. టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో సోమవారం నాడు పాలకమండలి తొలి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నేతలు రాజకీయ విషయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేస్తూ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలలో రాజకీయాలకు చెక్
బీఆర్ నాయుడు చైర్మన్‌గా ఇటీవల 25 మందితో టీటీడీ నూతన పాలక మండలిని కూటమి ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. నూతన పాలక మండలి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సోమవారం సమావేశమైంది. అనంతరం టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలో రాజకీయ అంశాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం. శ్రీనివాస సేతు వంతెనకు గడుణ వారధిగా నామకరణం చేయనున్నాం. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను వచ్చే మూడు నెలల్లో తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది.
శ్రీవారి భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా సర్వదర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో ఉన్న అన్య మతస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు.
తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం. శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అదనంగా మరో పదార్థాన్ని చేర్చాలని నిర్ణయం. ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకు (Public Sector Banks)ల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయం. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
అక్రమాలు నిజమని తేలితే వారికి కోటా రద్దు
ఇతర రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC), టీఎస్ ఆర్టీసీ (TGRTC)లకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో పూర్తిగా పరిశీలించిన అనంతరం ఆ సంస్థలకు కోటాను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత ఏడాది ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10 శాతం పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాంతో రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535/- బ్రహ్మోత్సవ బహుమానం అందించనున్నారు.
టీవీఎస్ సంస్థతో ఎంఓయూ
శ్రీవారి ఆలయం (Tirumala Temple)లో లీకేజీల నివారణకు, అన్న ప్రసాద కేంద్రం ఆధునికీకరణకు టీవీఎస్ సంస్థ (TVS)తో ఎంఓయూ చేసుకోవాలని నిర్ణయం. టీవీఎస్ సంస్థ ఈ పనులు ఉచితంగా చేయనుందని తెలిపారు. తిరుమలలో గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శ్రీ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లీజును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.