TTD News: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం, ఆ సమయాల మార్పులపై చర్చ!
TTD News: ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. అయితే ప్రధానంగా వైకుంఠ ఏకాదశి, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై ప్రధాన చర్చ జరుగనుంది.
TTD News: తిరుమలలోని అన్నమయ్య భవన్ టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. మదనపల్లెలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పాలక మండలి సమావేశం సమయాన్ని టీటీడీ మార్పు చేసింది. అయితే ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై ప్రధాన చర్చ జరుగనుంది. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులపై తేదీ ఖరారుపై చర్చించనున్నారు. జనవరి మాసంలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. డిసెంబరు ఒకట తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల మార్పుపై పాలక మండలి మరోకసారి చర్చించనుంది.
ముడి సరుకుల కొనుగోలపై పాలక మండలిలో చర్చ జరుగనుంది. ఇక అన్నమయ్య నడక మార్గం అభివృద్ధిపై పాలక మండలి సభ్యులు చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాల అభివృద్ధి శంకుస్ధాపన, మహా సంప్రోక్షణపై నిర్ణయం తీసుకోనున్నారు. వైకుంఠం ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగించాలా, రద్దు చేయాల అనే అంశంపై పాలక మండలి చర్చించనుంది. ఇక చిన్నపిల్లల హృదయాలయంలో అభివృద్ధికి నిధుకు కేటాయింపుపై చర్చించనున్నారు. వీటితోపాటు పలు కీలక అంశాలపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు అందుకేనా..??
ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన వేంకటేశ్వరస్వామి వారిని తమ జీవిత కాలంలో ఓసారైనా అతిదగ్గరగా దర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే క్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బడా పారిశ్రామిక వేత్తల నుంచి సిఫార్సు లేఖలను పొంది స్వామి వారి దర్శన భాగ్యం పొందుతూ ఉంటారు భక్తులు. అయితే ఈ బ్రేక్ దర్శన విధానం ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభం అయ్యి దాదాపు తొమ్మిది గంటల వరకూ కొనసాగుతూ ఉంటుంది. దీంతో స్వామి వారి దర్శన భాగ్యం కోసం రాత్రంతా వేచి ఉండే సామాన్య భక్తులు అధిక సమయం స్వామి వారి దర్శన భాగ్యం కోసం వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడేది.
టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యంను త్వరితగతిన కల్పించాలని భావించి పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. ముందు ఈ వీఐఒఇ బ్రేక్ దర్శనాలను ఉదయం పది గంటల నుంచి అమలు చేయాలని భావించినా, అదే సమయంలో కళ్యాణోత్సవం భక్తులు ఆలయ ప్రవేశం చేసే సమయం కావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించింది టీటీడీ. దీంతో సాధ్యసాధ్యాలను పరిక్షించేందుకు ఓ కమిటీని వేసిన టీటీడీ కమిటీ నివేదిక మేరకూ ఉదయం ఎమినిది గంటల నుంచి విఐపి బ్రేక్ దర్శన విధానంను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విధానాన్ని డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది టీటీడీ.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ విధానంను అమలు చేయడం ద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉండడమే కాకుండా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని టిటిడి భావించింది.