TTD News: తిరుమలలో భక్తుల రద్దీని అంచనా వేశాం, అన్ని చర్యలూ తీసుకున్నాం: ఈవో
భక్తులకు అల్పాహారం, భోజనం..చిన్నారులకు పాలు అందిస్తున్నామన్నారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని దూరం కానివ్వబోమని ధర్మారెడ్డి చెప్పారు. బుధవారం ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Tirumala Tirupati Devastanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) భక్తుల రద్దీ, తోపులాటపై ఈవో ధర్మారెడ్డి స్పందించారు. భక్తుల కోసం తాము అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఏర్పాట్లు చేయలేదనే వాదన నిజం కాదని కొట్టిపారేశారు. భక్తులు భారీగా వస్తారని ముందుగానే ఊహించామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. భక్తుల తాకిడి పెరగడంతో టోకెన్ లేకుండా అనుమతించామని అన్నారు. భక్తులకు అల్పాహారం, భోజనం..చిన్నారులకు పాలు అందిస్తున్నామన్నారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని దూరం కానివ్వబోమని ధర్మారెడ్డి చెప్పారు. బుధవారం ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు. మేం ముందస్తు ప్లానింగ్‌తో లేకపోతే భక్తులను సరిగ్గా ఎలా మేనేజ్ చేయగలిగామని చెప్పారు. తిరుమలలో గత వారాంతంలో మూడు రోజులకు గానూ ముందే టికెట్లను 9వ తేదీన ఇచ్చేశామని చెప్పారు. తర్వాత సర్వదర్శన టోకెన్లు తీసుకున్న వాళ్లు, తీసుకొనే వాళ్ల వల్ల రద్దీ బాగా పెరిగిందని ధర్మారెడ్డి అన్నారు. 9, 10, 11 తేదీల్లో రద్దీ తీవ్రం అయిపోయిందని చెప్పారు. దాంతో 12న టోకెన్ల జారీ కౌంటర్లను మూసేశామని అన్నారు. టోకెన్లు లేకపోయినా భక్తులు పోటెత్తారని అన్నారు. నిన్న మళ్లీ టోకెన్లు జారీ చేసే సమయంలో 20 వేల మంది మాత్రమే ఉన్నారని, భక్తుల ఆత్రుత కారణంగా క్యూ లైన్లలో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు.
వెంటనే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి, భక్తులను అనుమతించామని అన్నారు. ముందస్తు ప్రణాళికతో ఉన్నందువల్లే ఇబ్బంది తలెత్తినప్పుడు అరగంటలోనే భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించామని వెల్లడించారు. ఇప్పటి పరిస్థితుల్లో భక్తులు కంపార్ట్ మెంట్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
శ్రీవారిని లక్ష మంది దర్శనం చేసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ కరోనా కారణంగా తొలుత 3 వేల మందికే దర్శన అవకాశం కల్పించినట్లుగా ఈవో చెప్పారు. క్రమంగా ఆ సంఖ్యను 6 వేలు, 10 వేలు, 15 వేల నుంచి 45 వేల వరకూ భక్తులను అనుమతించినట్లుగా వెల్లడించారు. గతంలో సర్వదర్శన టోకెన్లు ఇచ్చిన ప్రతిసారి ఈ సమస్యలు వస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. నిన్న (ఏప్రిల్ 12) జరిగిన ఘటనల్లాంటివి గతంలో జరిగినట్లు చెప్పారు. తాము ఏ చర్యలు చేపట్టినా, ధర్నాలు చేపట్టడం పరిపాటి అయిపోయిందని, ప్రతి నిర్ణయానికి ఏదో ఒక సమస్య వస్తోందని ఈవో చెప్పారు. కరోనా సమయంలో సర్వ దర్శన టోకెన్లు భౌతికంగా ఇస్తే సమస్యలు ఉన్నాయని ఆన్ లైన్ చేశామని అన్నారు. ఆన్ లైన్ చేస్తే గ్రామీణ ప్రాంతాల భక్తులు, కంప్యూటర్ తెలీని వారికి అందుబాటులోకి రావడం లేదని విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు.