TTD News: శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారం తగదు, అన్ని టోకెన్లు పారదర్శకంగానే - టీటీడీ ఈవో వెల్లడి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళాలు అందించిన భక్తులు ఇప్పటి వరకు ఒక ఫిర్యాదు కూడా చేయలేదని ఈవో వివరించారు.
శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి కోరారు. ఆదివారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 23 మంది భక్తుల సలహాలు, సూచనలకు, ప్రశ్నలకు టీటీడీ ఈవో సమాధానం చెప్పారు. అనంతరం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ కు 880 కోట్లు విరాళాలు అందాయని, 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాల ఇచ్చి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఇప్పటి వరకు 2500 ఆలయాలను నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళాలు అందించిన భక్తులు ఇప్పటి వరకు ఒక ఫిర్యాదు కూడా చేయలేదని ఆయన వివరించారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ ఆలయ నిర్మాణాలు కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నామని అసంబద్ధమైన ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని టీటీడీ ఈవో అన్నారు. ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాల్లో నిర్వహిస్తున్నామని, అందులో మొదటిది దేవదాయ శాఖ, రెండవది టీటీడీ, మూడవది ఆలయ కమిటీలు, నాలుగవది స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలను చేస్తున్నామన్నారు. ఇక పార్వేటి మండలం శిథిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి ఆలయంలో భక్తుల తోపులాట జరుగుతోందని తెలిపారని, అయితే శ్రీవారి ఆలయంలో భక్తుల మధ్య తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మహా ద్వారం నుండి బంగారు వాకిలి వరకు సింగల్ లైన్ లో భక్తులను అనుమతిస్తున్నామన్నారు. ఇక వికలాంగులను, సీనియర్ సిటిజెన్స్ లను కలిపి కాకుండా సపరేట్ గా పంపుతామన్నారు. లగేజ్ కలెక్షన్స్, డెలివరీ సిస్టంలో నూతన విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.
శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల విషయంలో పారదర్శకంగానే టోకెన్ల కేటాయింపు చేస్తున్నామని, 9 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులు దర్శనం చేసుకున్నారని, పార్వేటి మండపం జీర్నోద్దారణపై వివాదం సరైనది కాదని అన్నారు. కుంగిపోయే పరిస్థితిలో ఉంటే పునరుద్ధరణ పనులు చేపట్టామని, సమ్మర్ తో సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు వస్తున్నారని, అన్నారు. వేసవి నేపథ్యంలో గతంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా తగ్గించామని, ఇక ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలో పంచ బేరాలను పరిరక్షించడమే మొదటి ప్రాధాన్యం అని ఆగమ పండితులు సలహాలు ఇచ్చారని, పంచ బేరాల్లో ఏదైనా విగ్రహాలు భిన్నమైతే తిరిగి వాటిని కరిగించి విగ్రహాలుగా మల్చాలని సూచించారని చెప్పారు.
అందులో భాగంగానే ఉత్సవ విగ్రహాలను పరిరక్షించాలని అర్చకులు, జీయ్యంగార్లు, ఆగమ పండితులు సూచించడంతో నిత్యం నిర్వహించే అభిషేక సేవను రద్దు చేశామన్నారు. ఇక జూన్ మాసంలో 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా 116.14 కోట్ల ఆదాయం లభించిందని అన్నారు. ఇక జూన్ మాసానికి సంబంధించి కోటి ఆరు లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగిందని, 10.80 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 24.38 లక్షల మంది భక్తులు తిరుమలలో అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.