TTD Board Decisions: శ్రీవారి భక్తుల కోసం తిరుపతిలో 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
TTD : టీటీడీ బోర్డు భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొండ కిందనే భక్తులకు వసతి కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్‌ను నిర్మించాలని నిర్ణయించింది.

TTD board takes key decisions: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు.
- తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం.
- టీటీడీ బోర్డు విద్యాశాఖ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు, అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదం.
- ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం.
- భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు, ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోదం.
- దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయం.
- తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనులలో భాగంగా రెండవ దశలో రూ.14.10 కోట్లు . మొదటి దశలో రూ.4 కోట్లు మంజూరు
- తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయం.
- టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం.
- తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించాలని నిర్ణయం.
- శ్రీవారి పోటులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోటు సూపర్‌వైజర్ పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.
- తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో జాతీయ సంస్తృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డా. చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.డి.ప్రభాకర్ కృషమూర్తిలతో కమిటీ ఏర్పాటు
- శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటు, నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం.
- తిరుమలలోను, కాలిబాటలో ఉన్న పురాతన ప్రాశస్త్యం గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి, అనుభవం గల అధికారుల నియమకానికి ఆమోదం.
- రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో డేస్కాలర్‌లకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం.
- టీటీడీ అనుబంధ ఆలయాలలో పని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం.





















