TTD Darshan Tickets: టీటీడీ దర్శన టికెట్ల డేట్స్ విడుదల - వివిధ సేవలను కూడా ఇక్కడ బుక్ చేసుకోండి
Tirumala News: తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను నవంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని వెల్లడించారు.
TTD News: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala News) అధికారులు ప్రకటించారు. భక్తుల సౌకర్యం కోసం 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుందని వెల్లడించారు.
అదేవిధంగా తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను నవంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇలా గదులు, స్లాట్స్ బుక్ చేసుకోవడం ద్వారా భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తక్కువ సమయంలోనే స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు.
నవంబరు 27న శ్రీవారి సేవ కోటా విడుదల
అలాగే 2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుండి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అర్హులు.
అదేవిధంగా, తిరుమల, తిరుపతిలో భక్తులకు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలను www.tirumala.org వెబ్‌సైట్‌లో భక్తులు బుక్ చేసుకోవచ్చు.