Jagan Tirumala Tour: రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
Jagan To Visit Tirumala: అటు టీడీపీ, ఇటు జనసేన.. జగన్ తిరుమల యాత్రపై తీవ్ర స్థాయిలో కౌంటర్లిస్తున్నారు. దీంతో ఆ యాత్ర వివాదాస్పదం అయ్యే అవకాశాలున్నాయి.
Tirumala Laddu Controversy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల యాత్ర వివాదాస్పదం అయ్యే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. గతంలో జగన్ చాలా సార్లు తిరుమల వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఆయన తిరుమల వెళ్లి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు సమర్పించారు కూడా. కానీ ఈ సారి యాత్ర చాలా ప్రత్యేకం. అసలీ యాత్ర సక్రమంగా జరుగుతుందా..? లేదా అనేది కూడా అనుమానమే. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ టీడీపీ, జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
జగన్ సంతకం పెట్టాలని డిమాండ్
"మీరేదో 28వతేదీన తిరుమల వెళ్తారని తెలిసింది. మెట్ల మార్గంలో వెళతారో, రోడ్డు మార్గంలో వెళతారో అది మీ ఇష్టం. మెట్ల మార్గంలో వెళ్తే కిందే సంతకం పెట్టండి. తిరుమల వెళ్లాక 17వ కంపార్ట్ మెంట్ లో రిజిస్టర్ ఉంటుంది. అన్య మతస్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే అందులో సంతకం పెట్టాలి. అక్కడ సంతకం పెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి." అంటూ జగన్ తిరుమల యాత్రపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి పయ్యావుల కేశవ్. చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే జగన్ కచ్చితంగా రిజిస్టర్ లో సంతకం పెట్టాల్సిందేనన్నారు. ఒకవేళ జగన్ ఇప్పుడు రిజిస్టర్ లో సంతకం పెడితే దాన్ని మరింత రాద్ధాంతం చేస్తుంది టీడీపీ. పెట్టకపోయినా కూడా విమర్శలు తప్పవు అనేలా పరిస్థితులున్నాయి.
నువ్వు అన్యమతస్తుడువి కాబట్టి, తిరుమల దర్శనానికి వెళ్ళే ముందు, నాకు వెంకటేశ్వర స్వామి పై నమ్మకం ఉందని, డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు @ysjagan. ఇది చట్టం.. దేవుడు అంటే భక్తి లేదు, కనీసం చట్టానికి గౌరవం అయినా ఇవ్వు.#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#EndOfYCP#tirumala… pic.twitter.com/r039rDSAa1
— Telugu Desam Party (@JaiTDP) September 25, 2024
లడ్డూ వివాదం మొదలైన తర్వాత సీఎం చంద్రబాబు కూడా జగన్ పై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. జగన్ అన్య మతస్తుడు కాబట్టి తిరుమలలో ఉన్న రిజిస్టర్ లో సంతకం చేయాలని, కానీ ఆయన ఎప్పుడూ ఆ సంప్రదాయం పాటించలేదన్నారు. గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం కూడా సంతకాలు చేశారని, వారికంటే జగన్ గొప్పవారా అని ప్రశ్నించారు. ఈ వివాదం తర్వాత జగన్ తొలిసారిగా తిరుమల వెళ్తుండటంతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని మరోసారి టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
తిరుమలకు వెళ్లే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తావా @ysjagan?#ధర్మో_రక్షతి_రక్షితః#धर्मो_रक्षति_रक्षितः#DharmoRakshatiRakshitah#TirupatiLaddu #SanatanaDharmaRakshanaBoard https://t.co/8KjrWpPukr pic.twitter.com/65Xty7kONj
— JanaSena Party (@JanaSenaParty) September 25, 2024
జనసేన డిమాండ్లు..
జగన్ తిరుమల యాత్ర సందర్భంగా జనసేన కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చింది.
- తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేస్తారా, లేదా..?
- టీటీడీ బోర్డు చైర్మన్ గా అన్యమత విశ్వాసాలు ఉన్న వ్యక్తుల్ని నియమించినందుకు క్షమాపణలు అడుగుతారా..?
- తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చిన వైవీ సుబ్బారెడ్డి తరపున స్వామివారి ముందు మోకరిల్లుతారా..?
- మీకు నచ్చిన కంపెనీకి కాంట్రాక్ట్ లు ఇచ్చేందుకు రూల్స్ మార్చిన విషయంపై సంజాయిషీ ఇస్తారా..?
- కేవలం ఓట్ల కోసమే దేవాలయాలకు వస్తున్నాను, మిగతా సమయాల్లో దేవాలయాలపై దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తున్నానని ఒప్పుకుంటారా..?
- ఇంటి పెరట్లోనే తిరుమల సెట్ వేయించుకున్న జగన్ ఇప్పుడెందుకు తిరుమల వస్తున్నారు..?
- 290 దేవాలయాలను ధ్వంసం చేయడంతోపాటు తాజాగా అనంతపురం జిల్లాలో స్వామివారి రథాన్ని వైసీపీ నాయకులు తగలబెట్టారనే నిజాన్ని నిర్థారిస్తారా..?
- కోట్లాదిమంది భక్తులకు నాన్ వెజ్ లడ్డూ తినిపించినందుకు ప్రాయశ్చిత్తం తెలియజేస్తారా..?
సమాధానం చెప్పు జగన్ అంటూ జనసేన నుంచి ఓ ట్వీట్ పడింది.
అటు టీడీపీ, ఇటు జనసేన.. జగన్ తిరుమల యాత్రపై తీవ్ర స్థాయిలో కౌంటర్లిస్తున్నారు. దీంతో ఆ యాత్ర వివాదంగా మారుతుందనే ప్రచారం జరుగుతోంది.
Also Read: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్