తప్పుకోనున్న వైవీ సుబ్బారెడ్డి, బీసీకేనా టీటీడీ చైర్మన్..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2 టర్మ్ లు రెడ్డికి చాన్స్ ఇచ్చారు. మూడున్నారేళ్లుగా ఒకే వ్యక్తి ప్రతిష్ఠాత్మక టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఉండటంతో విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారట.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ గా చాన్స్ ఇచ్చారు జగన్. టర్మ్ పూర్తయిన తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం సాగింది. కానీ, రెండోసారి కూడా ఆయన టీటీడీ ఛైర్మన్ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని బోర్డు పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉంది. కానీ ఆయనకు
కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను సీఎం అప్పగించారు. విశాఖ కేంద్రంగా సాగుతున్న రాజకీయాల్లో పార్టీ నుంచి సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించాల్సి వస్తోంది. ఓవైపు టీటీడీ చైర్మన్‌గా, మరోవైపు పార్టీ సమన్వయ బాధ్యతలు నిర్వహించడం కష్టంగా మారింది. అందుకే టీటీడీ బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఆయనే స్వయంగా సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.
ఇప్పటికే కొత్త చైర్మన్, పాలక మండలి సభ్యుల ఎంపికకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రెండు వారాల్లో ఎంపిక ప్రక్రియ ముగిస్తుందనే ప్రచారం నడుస్తోంది. తిరుమలలో జనవరి 2 నుంచి 11వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు కల్పిస్తారు. ఇదంతా పూర్తయ్యాకనే కొత్త బోర్డును ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌గా అవకాశమిచ్చింది. ఈసారి బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుబ్బారెడ్డి స్థానంలో టీటీడీ నూతన ఛైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన పార్టీ సీనియర్ ను ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి రెండు టర్మ్ లు రెడ్డికి చాన్స్ ఇచ్చారు. మూడున్నారేళ్లుగా ఒకే వ్యక్తి ప్రతిష్ఠాత్మక టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఉండటంతో విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారట. ఈసారి టీటీడీ ఛైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయినట్టు వైసీపీ వర్గాల్లో టాక్. వైసీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న బీసీ నేత జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో టీడీపీ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. ఇప్పుడు వైసీపీలోని బీసీ నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జంగా కృష్ణమూర్తి కి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం దక్కటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీకి విధేయుడైన జంగా కృష్ణమూర్తి.. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భాగంగా జంగా కృష్ణమూర్తి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు సిద్ధారెడ్డి అనే మరో పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక టీటీడీ సలహామండలి (ఎల్‌ఏసీ) చైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. దీంతో బోర్డు సభ్యుల సంఖ్య 50 దాటిపోయింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ఈసారి ప్రత్యేక ఆహ్వానితులు లేకుండా నియామకాలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.