CI Anju Yadav: లేడీ సింగం సీఐ అంజూ యాదవ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా!
Srikalahasti CI Anju Yadav: ఇటీవల జనసేన నేతపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Srikalahasti CI Anju Yadav: గత వారం రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న పేరు శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్. తిరుపతి జిల్లాలో ఆమె తెలియని వారు ఉండరు. లేడీ గబ్బర్ సింగ్, లేడీ సింగంగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జనసేన పార్టి కార్యకర్తపై సీఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. దీంతో స్వయంగా జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చి అంజూ యాదవ్ పై ఎస్పీ పరమేశ్వర రెడ్డికి పిర్యాదు చేశారు. దీంతో అంజూయాదవ్ టాపిక్ శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటుగా, తిరుపతి జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. త్వరలో సీఐ అంజూయాదవ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమేతే.. సీఐ అంజూయాదవ్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఉన్నది ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కడప జిల్లా, నంది మండలంకు చేందిన ఓబన్న, అనంతమ్మ దంపతులకు అంజూ యాదవ్ జన్మించారు. వీరిది పేద వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనం నుండి అనేక కష్టాల మధ్య పెరిగారు. చదువుపై మక్కువ ఉండడంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. అటుతర్వాత బ్యాంక్, ఎల్ఐసీ, ఎస్సై పోటీ పరిక్షల్లో ఉత్తీర్ణత అయినా అంజూ యాదవ్ పోలీసు ఉద్యోగంలోనే రానించాకని నిర్ణయం తీసుకున్నారు. 1998లో ఎస్ఐగా ఎన్నికై చిత్తూరు జిల్లా, ఐరాల మండలం పోలీసు స్టేషనుకు ఎస్ఐగా భాధ్యతలు నిర్వర్తించారు. మొదట్లో విధి నిర్వహణలో అంజూయాదవ్ కు కొంత ఒత్తిడులు రావడంతో కొంతకాలం సెలవుపై వెళ్లారు.
అంజూ యాదవ్ సొంత అక్క విదేశాలలో ఉండడంతో ఆమె వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. కానీ వీసా రాకపోయే సరికి మళ్లీ పోలీసుగానే ఉండి పోవాలని నిర్ణయం తీసుకున్నారు.. విధుల్లోకి చేరిని మొదటి నుండి అంజూయాదవ్ వ్యవహార శైలి రాజకీయ నాయకులకు మొదలుకొని, అధికారులు, సామాన్యుల వరకూ కొంత ఇబ్బందిని కలుగజేసేది. ఎవరిని లెక్క చేయని ఆమె స్టైల్ తో లేడీ గబ్బర్ సింగ్ గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిడులకు లొంగని ఆమె, తనకు నచ్చినట్లు వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే అంజూయాదవ్ తమ మండలం పోలీసు స్టేషనుకు వద్దని పోలీసు ఉన్నతాధికారులకు బడా రాజకీయ నాయకులే ఒత్తిడి చేసేవారు.
2009లో తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్ కు ఎస్సైగా ట్రాన్సఫర్ పై వచ్చిన ఆమె ఓ వివాదం విషయమై శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. అనంతరం కొన్ని రోజులకే తిరిగి విధుల్లో చేరినా ఆమె వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు లేదు. 2003 అక్టోబర్ లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుకు అలిపిరిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో వీరోచితంగా వ్యవహరించి ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ముఖ్య భూమిక పోషించారు అంజూయాదవ్. అప్పటి నుంచి ఆమె కొంచెం హైలైట్ అయ్యారు. కానీ తన వ్యవహార శైలితో నిత్యం వివాదాల్లో ఉంటూ, వార్తల్లో నిలిచేవారు. తప్పు చేసిన వారిపై ఎటువంటి రాజకీయ వత్తుడులు వచ్చినా శివంగిలా రెచ్చి పోయేవారు. రాజకీయ నాయకులను గానీ, అధికారులను గానీ అసలు లెక్క చేసేది కాదు. కోపం తెప్పిస్తే ఎవరికైనా చెంప చెల్లుమనేది. దీంతో అంజూయాదవ్ కు ఎదురు పడాలంటేనే చాలా మంది క్రిమినల్ భయపడేవారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన శ్రీకాళహస్తి జనసేన శ్రేణులను సీఐ అంజూయాదవ్ అడ్డుకున్నారు. ఈ విషయమై పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో జనసేన శ్రేణులపై ఆగ్రహించిన సీఐ అంజూయాదవ్, అక్కడే ఉన్న జనసేన కార్యకర్త కొట్టే సాయి చెంప చెల్లుమనిపించారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోపై స్పందించిన జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. దీంతో ఈ ఘటన వివాదానికి దారి తీసింది.. విపక్ష నేతల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
అంజూ యాదవ్ కు వివాదాలు లేమి కొత్తేమి కాదు. గతంలోనూ అంజూయాదవ్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. రేణిగుంటలో సిఐగా పని చేస్తున్న సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డితో ఓ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదంకు దారి తీసింది. ఈ ఘటనలో సీఐ అంజూ యాదవ్ పై సస్పెండ్ వేటు పడుతుందని అందరూ ఊహించినప్పటికీ, ఎవరు ఊహలకు అందని విధంగా శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐగా అంజూ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఆమె శ్రీకాళహస్తి సిఐగా బాధ్యతలు చేపట్టడం వెనుక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు నేటికీ ఉన్నాయి. అయితే శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్న సీఐ అంజూయాదవ్ కు అన్ని విధాలుగా ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని స్ధానికంగా వినిపిస్తోంది. జనసేన కార్తకర్త కొట్టే సాయి వివాదం విషయం అనంతరం పాత విషయాలు సైతం వెలుగు చూస్తున్నాయి. దీనితో పాటు త్వరలో సీఐ అంజు యాదవ్ అధికార పార్టీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం ఆమె సెలవులో ఉండడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది.
2019 ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లా, కదిరి సీఐగా పని చేస్తున్న గోరింట్ల మాదవ్ కు వైసీపీ ఛాన్స్ ఇచ్చింది. గోరింట్ల మాదవ్ ఎంపీగా భారీ విజయంతో సాధించారు.. అయితే త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో అంజూ యాదవ్ ను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదని శ్రీకాళహస్తిలో చర్చ జరుగుతోంది. ఎక్కువ కాలం తిరుపతి జిల్లాలో పని చేసిన కారణంగా సీఐ అంజూ యాదవ్ కు అధికార పార్టీ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అంజూయాదవ్ ను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. నిజం ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial