Tirumala News: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎనిమిది గంటల సమయం
Tirumala News: తిరుమలలో గడిచిన రెండు రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. సోమవారం భక్తులు తక్కువగా ఉండడంతో కంపార్ట్‌మెంట్లలో భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది.
Tirumala News: తిరుమలలో గడిచిన రెండు రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ భారీగా తగ్గుముఖం పట్టింది. శని, ఆదివారాల్లో స్వామి వారిని 70 వేల మందికిపైగా దర్శించుకున్నారు. ఈ రెండు రోజులు స్వామి వారి దర్శనానికి పది నుంచి 12 గంటలు సమయం పట్టగా, భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టడంతో సోమవారం నుంచి ఆ సమయం కాస్త తగ్గుముఖం పట్టనుంది. సోమవారం భక్తులు రద్దీ తక్కువగా ఉండడంతో కంపార్ట్‌మెంట్లలోనూ భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది. స్వామి వారి దర్శనానికి ఏడు నుంచి ఎనిమిది గంటలు సమయం మాత్రమే పడుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండడంతో గడిచిన మూడు రోజులుగా కొండపై రద్దీ నెలకొంది. భక్తుల కోసం కొండపై టీటీడీ ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నీళ్లతోపాటు పిల్లలకు పాలను సిబ్బంది అందిస్తున్నారు.
స్వామిని దర్శించుకున్న 70 వేల మంది
తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు గడిచిన మూడు రోజులు నుంచి భారీగా భక్తులు రావడంతో కొండపైన అనేక ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. శనివారం స్వామి వారిని 69,332 మంది దర్శించుకోగా, భక్తులు అందించిన కానుకలు ద్వారా రూ.3.22 కోట్లు ఆదాయం సమకూరింది. ఆదివారం స్వామివారిని 70,679 మంది దర్శించుకోగా, కానుకల రూపంలో శ్రీ వారి హుండీకి రూ.4.36 కోట్లు ఆదాయం సమకూరింది. ఆదివారం దర్శించుకున్న భక్తుల్లో 21,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం కూడా సుమారు 50 వేల మంది వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశముందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.