Madanapalli News: ఆర్డీవో మురళీపై ప్రభుత్వం వేటు- ఆ కేసులో కాదు, అక్రమ ఆస్తుల కేసులో చర్యలు
Andhra Pradesh News: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదం కేసు విచారణ పక్కదారి పట్టిందా అని చర్చ జరుగుతోంది. ఆర్డీవో మురళిపై అక్రమ ఆస్తుల కేసులో చర్యలు తీసుకున్నారు.
Madanapalli sub collector office: మదనపల్లి: చిన్నపాటి అగ్ని ప్రమాదం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా స్పందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కొన్ని నెలల కాలంలో సీఐడీ విచారణ సైతం జరుగుతోంది. పలువురు అధికారులు సైతం సస్పెండ్ అయ్యారు. అందులో సూత్రధారులుగా ఉన్న వారిని అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం లో నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం సర్వసాధారణమని అంతా భావించారు. ఆ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి వెళ్లగా, ఆగమేఘాల మీద ఆయన స్పందించారు. సీఎం ఆదేశాలతో సీఐడీ చీఫ్, ఏపీ డీజీపీని హెలికాప్టర్ ద్వారా మదనపల్లికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అన్ని కోణాల్లో పరిశీలన చేసి ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా అనుమానం వ్యక్తం చేశారు.
గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ నాయకులు మదనపల్లి సబ్ కలెక్టర్ పరిధిలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారని.. వాటి నుంచి బయట పడేందుకు ఇదంతా చేశారని భావించారు. కేసును మదనపల్లి పోలీసుల నుంచి సీఐడీకి బదిలీ చేశారు. సీఐడీ అధికారులు పలువురిని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. ఇందులో కొందరు జర్నలిస్టుల పాత్ర సైతం ఉందని గుర్తించారు. అధికారులు, నాయకులు, జర్నలిస్టులు ఇలా కేసుతో సంబంధం ఉన్న వారి ఇళ్లను పరిశీలన చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అవినీతి నిరోధక శాఖ తనిఖీలు
మదనపల్లి ఘటనలో అప్పటి ఆర్డీవోగా ఉన్న మురళీపై ప్రభుత్వం వేటు వేసింది. విచారణకు సహకరించాలని సూచించింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో చోటు చేసుకున్న ఘటనపై విచారణలో మురళి సహా అతని కుటుంబ సభ్యులు, బంధువులు, ఆయనకు సహకరించారనే అనుమానం ఉన్న వారి ఇళ్లను, కార్యాలయాలను ఏక కాలంలో మొత్తం 13 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. అసలు ఫైల్స్ దగ్థం కేసులో అరెస్టు చేశారని ఉదయం నుంచి ప్రచారం జరిగింది. సాయంత్రానికి అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి అక్రమ ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహించామని చెప్పారు.
మదనపల్లి అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తరువాత నుంచి ఆయన విధుల్లో లేరు. ప్రమాదం జరిగిన తరువాత తనిఖీలు చేశారు. మరి ఇలా అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీ చేయడం వెనుక ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఇలా చేస్తున్నారని మురళీ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫైల్స్ దగ్థం చేసిన కేసులో మురళి పాత్ర లేకపోయినా కూటమి ప్రభుత్వం ఇబ్బంది దాని గురించి బయట పడేందుకు అక్రమ ఆస్తుల కేసు పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
కేసు కొలిక్కి వచ్చేనా..
మదనపల్లి ఫైల్స్ దగ్థం కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో అధికారులకు స్పష్టత రావడం లేదు. సగం కాలిన ఫైల్స్ లభ్యం అయ్యాయి.. పూర్తి వివరాలు ఆన్ లైన్ లో ఉంటాయి. అక్రమంగా మార్పు చేసుకున్న భూములు సైతం తెలుస్తాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండగా కేసు విచారణ ఎలా సాగుతుంది... ఎప్పటికి ముగుస్తుంది అనేది మాత్రం ప్రశ్నగా మిగిలిపోయింది. ఘటన ఎవరు మర్చిపోకుండా 10 రోజులకు ఒక్కసారి దర్యాప్తు జరగడం, మళ్లి సైలెంట్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పటికి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారో, అందులో ఏం తేల్చుతారోనని స్థానికంగా ఆసక్తి నెలకొంది.