Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Andhra Pradesh News | వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందులలో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
Pulivendula News | కడప: వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargava Reddy)పై కడప జిల్లా పులివెందులలో నమోదైంది. ఓ దళిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కులం పేరుతో దూషించారని బాధితుడి ఫిర్యాదు
వైసీపీ సోషల్ మీడియా రన్ చేస్తున్న రాష్ట్రస్థాయి నేత అర్జున్‌రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డిపై కూడా కేసు నమోదైనట్లు పులివెందుల పోలీసులు తెలిపారు. రవీందర్‌రెడ్డి గత కొన్నేళ్లుగా జగన్‌ను విమర్శించేవారిపై, టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని బాధితుడు పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారని హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కారణంగానే వైసీపీకి చెందిన వారిని అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు.
సోషల్ వేధింపులు ఉపేక్షించేది లేదన్న ఏపీ ప్రభుత్వం
వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం, వ్యక్తిగత టార్గెట్ పోస్టులు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చెలరేగిపోయి వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం హామీతో కొందరు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, సోషల్ వేధింపులపై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇదివరకే వైసీపీ నేత బోరుగడ్డ అనిల్, మాజీ సీఎం జగన్ భార్య భారతీ రెడ్డి పీఏ వర్రా రవీందర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. వర్రా రాఘవరెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి మరికొందరిపై నమోదైన కేసులలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బాధితుల నుంచి సాక్ష్యాలు సేకరించి ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు.