Pulivarthi Nani Attacked: పులివర్తి నానిపై దాడితో చంద్రగిరిలో టెన్షన్ టెన్షన్- తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందు భార్య సుధారెడ్డి ధర్నా
Tirupati News: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి నిందితులను అరెస్టు చేయాలని తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన సతీమణి సుధారెడ్డి ధర్నా చేస్తున్నారు.
Chandragiri News: చంద్రగిరిలో పులివర్తి నానిపై జరిగిన దాడి కేసు మరింత ముదురుతోంది. దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాల్సిందేనంటూ నాని భార్య సుధారెడ్డి ధర్నాకు దిగారు. ఆమెకు మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇంకా ఆ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంలలో నేతల జాతకాలు భద్రంగా ఉన్నాయి. చాలా మంది నేతలు వారి పనుల్లో బిజీ అయిపోయారు. కానీ నాయకుల కోసం పని చేసిన కేడర్ మాత్రం ప్రత్యర్థులపై పగ తీర్చుకునే పనిలో పడింది. ఇలాంటి రివేంజ్ పాలిటిక్స్ చంద్రగిరి కూడా వేదికైంది.
చంద్రగిరిలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నానిపై మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. పద్మావతి యూనివర్శిటీలో ఉన్న ఈవీఎంల భద్రత పరిశీలించి వెళ్తున్న టైంలో అటాక్ జరిగింది. కారులో ఉన్న పులివర్తి నానిపై వెనుకే ఫాలో అవుతూ వచ్చిన బ్యాచ్ మూకుమ్మడిగా దాడి చేసింది.
దీంతో ఒక్కసారి రోడ్లపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నానిపై దాడిని అడ్డుకున్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయనపై కూడా అటాక్ చేశారు వైసీపీ నేతలు. తీవ్ర గాయాలతో నాని అక్కడ ధర్నాకు దిగారు. టీడీపీ కార్యకర్తలు పక్కనే ఉన్న చెవిరెడ్డి ఊరిపైకి దాడికి వెళ్లారు. పోలీసులు కలుగుజేసుకొని లాఠీ ఛార్జ్ చేసి వెనక్కి పంపించారు.
గంటలో నిందితులను అరెస్టు చేస్తామన్న ఎస్పీ శ్రీకాంత్... పులివర్తి నాని ఆసుపత్రికి తరలించారు. అయితే దాడికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేయడం ఆ దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని పులివర్తి నాని భార్య సుధారెడ్డి ఖండించారు. ఇప్పటికైనా పోలీసులు నిజాలు తెలుసుకొని స్వతంత్రంగా పని చేయాలని సూచించారు.
నానిపై దాడి చేసిన నిందుతుల పేర్లు చెప్పిన సుధారెడ్డి... 24 గంటల్లో వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందు యావత్ చంద్రగిరి వచ్చి కూర్చుంటుందని మంగళవారమే హెచ్చరించారు. ఈ దాడి వెనుకాల చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఈవీఎంల భద్రతను పరిశీలించేందుకు వెళ్లిన తనపై కూడా దుర్భాషలాడారని వాపోయారు.
అన్నట్టుగానే నానిపై దాడి కేసులో అసలు నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ సుధారెడ్డి ధర్నాకు కూర్చున్నారు. తన అనచురులు, టీడీపీ జనసేన శ్రేణులతో వచ్చి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అసలైన నిందితులను అరెస్టు చేయాల్సిందనంటూ నినాదాలు చేస్తున్నారు.
నానిపై దాడి కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. నాని ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్టున్నట్టు పేర్కొన్నారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా ఎవరి పాత్రైన ఉంటే కచ్చితంగా అరెస్టు చేస్తామని అంటున్నారు.
ప్రస్తుతానికి ఉద్రిక్తంగా ఉన్న చంద్రగిరిని మరింత టెన్షన్‌లో పెట్టొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని ధర్నా విరమించాలని ఆమెతో చర్చలు జరుపుతున్నారు.