Tirupati News: గుమస్తా భార్యపై బంగారం దొంగతనం కేసు- విచారించిన పోలీసులు యజమానిపైనే రేప్ కేస్ పెట్టారు
గుమస్తా భార్యపై మోజు పడ్డాడు ఓ బంగారు షాపు యజమాని.. ఎలాగైనా లొంగ దీసుకోవాలన్న ప్లాన్ తో ఇంటికి పిలిచి ఏం చేసాడో తెలుసా.?
కామంతో కళ్ళు మూసుకు పోయిన కొందరు మృగాలుగా మారుతున్నారు.. పసికందుల వద్ద నుంచి పండు ముసలమ్మ వరకూ ఎవరిని వదలడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడ్డమే కాకుండా ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నా, కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా, ఏదోక మూల ఏదోక రకంగా మహిళలపై అత్యాచారాలు పాల్పడుతూ తమ కామ వాంఛను తీర్చుకుంటున్న ఘటనలు అనేకం.
తాజాగా గుమస్తా భార్యపై కన్నేసిన ఓ బంగారు వ్యాపారి, ఎలాగైనా ఆ మహిళను లోబరుచుకోవాలని తన కామ వాంఛ తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంటికి పిలిపించాడు యజమాని. మహిళపై అత్యాచారానికి ప్రయత్నించడంతో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందామహిళ. దీంతో యజమానిని పోలీసుకు కటకటాల్లొకి నెట్టారు.
తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన నేమ్ చంద్ బడా బంగారు వ్యాపారి. నేమ్ చంద్‌కు రేణిగుంటలోనే కాకుండా చెన్నై, బెంగుళూరులో కూడా బంగారు వ్యాపారాలు ఉన్నాయి. బడా వ్యాపారైన నేమ్ చంద్‌కు వక్రబుద్ది పుట్టింది. తన వద్ద పని చేసే గుమస్తా భార్యపై అత్యాచారం చేయడానికి పథకం పన్నాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుమస్తాకి ఫోన్ చేసిన నేమ్ చంద్ ఇల్లు శుభ్రపరచాలి మీ ఆవిడను ఇంటికి పంపు అని చెప్పాడు. గుమస్తా కూడా అతని మాటలు నమ్మి తన భార్యను యజమాని ఇంటి వద్దకు పంపాడు. యజమాని ఇంటికి చేరుకున్న గుమస్తా భార్య... తన భర్తకు ఫోన్ చేసి ఇక్కడ యజమాని ఒక్కరే ఉన్నారని, తాను లోనికి వెళ్ళాలంటే భయంగా ఉందని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అంత భయంగా ఉంటే ఫోన్ కట్ చేయకుండా అలానే పెట్టుకుని లోపలికి వెళ్ళు నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే బయటకు రమ్మని చెప్పాడు.
భర్త చెప్పిన మాటలకు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని ఫోన్ కట్ చేయకుండా అలానే పెట్టుకుని లోపలికి వెళ్లింది. ఇంటి పని పేరుతో గుమస్తా భార్యతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, చేయి పట్టుకుని లాగి పక్కన కూర్చో పెట్టుకున్నాడు నేమ్ చంద్. "నువ్వు నాతో ఉండు.. నీకు ఏమి కావాలో నేను చూసుకుంటా.. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా.. నీకు ఏది కావాలంటే అది తీసుకో బట్టలు,నగలు ఏవి కావాలన్న తీసుకో".. నీకు సమయం ఉన్నప్పుడు నాతో ఏకాంతంగా గడుపు నిన్ను నేను చూసుకుంటానని మాయ మాటలతో గుమస్తా భార్యను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు.
యజమాని మాటలపై ఆగ్రహించిన గుమస్తా భార్య, ఆయన్ని పక్కకు నెట్టి వేసి ఇంటి నుంచి వచ్చేసింది. అదే సమయంలో ఇంట్లో జరిగిన విషయం బయట చెప్తే చంపేస్తానని, నా షాప్‌లో బంగారు దొంగతనం చేశావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు నేమ్ చంద్.
వంకర బుద్దితో ఉన్న బంగారు దుకాణం యజమాని నేమ్ చంద్ నిన్న మధ్యాహ్నం రేణిగుంట డిఎస్పి వద్దకు వెళ్లి తన ఇంటికి వచ్చిన గుమస్తా భార్య తన ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగలించిందని ఫిర్యాదు చేశాడు. దీంతో గుమస్తా ఆశ్చర్యపోయాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై మార్వాడీ సంఘానికి ఫిర్యాదు చేశారు. తన భార్యను లొంగ దీసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడని... ఇప్పుడు తిరిగి తమపైనే కంప్లైంట్ చేశాడని వాపోయారు.
మార్వాడి సంఘం నాయకులతో కలిసి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వీరి మాటలు విన్న తిరుపతి అడిషనల్ ఎస్పీ... జరిగిన వాస్తవ ఘటనపై పూర్తి విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ ఎస్పి ఆదేశాలతో దర్యాప్తు సాగించిన పోలీసులు నేమ్ చంద్ అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. దీంతో నిందితుడు నేమ్ చంద్ ను అదుపులోకి తీసుకుని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.