Kanipakam Temple EO: రసీదులు ఇవ్వకుండానే విరాళాల స్వీకరణ, కాణిపాకంలో మరో వివాదం !
Kanipakam Temple EO: కాణిపాకం ఆలయ సిబ్బంది తప్పులతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే విరాళాలు ఇచ్చిన రసీదులు అందజేయడం లేదంటూ వస్తున్న ఆరోపణలపై ఈవో వివరణ ఇచ్చారు.
Kanipakam Temple EO: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం సత్య ప్రమాణాలకు కొలువైన ఆలయంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతటి మహిమలు కలిగిన ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర దేవస్థానం ఆలయ అర్చకులు సోమశేఖర్ గురుకుల్.. తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. సత్య ప్రమాణాలకు కాణిపాకం ఆలయం పెట్టిందే పేరుగా ఉంది. అలాంటి ఆలయానికి సంబంధించి అర్చకులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరైనా కాణిపాకం వచ్చి ప్రమాణం చేసి.. ఆపై తప్పు చేస్తే వారిని స్వామి వారు తప్పక శిక్షిస్తాడని ఒక నమ్మకం ఉంది. కానీ ఆలయంలో పని చేసే అర్చకులు, సిబ్బందికి మాత్రం ఆ భయం లేకపోవడం గమనార్హం. వినాయక స్వామి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర దేవస్థానం అర్చకులు సోమేశ్వర్ గురుకులపై ఆరోపణలు చేస్తున్నారు.
విజయలక్ష్మి అనే భక్తురాలి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు..
చిత్తూరు కట్టమంచికి చెందిన విజయలక్ష్మి అనే ఒక భక్తురాలు నుంచి డబ్బులు ఆయన తీసుకున్నారని చెబుతున్నారు. అయితే భక్తురాలి ఆరోపణలో వాస్తవం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన దీన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమశేఖర్ గురుకుల్ ప్రస్తుతం కాణిపాక దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన పాలకమండలి ఎక్స్ ఆఫీషియో సభ్యులు మరియు మణికంఠేశ్వర స్వామి ఆలయ అర్చకులు కావడం గమనార్హం.
తప్పులు జరగకుండా చూడాల్సిన అధికారులు, పాలక మండల సభ్యులే.. ఇలాంటి తప్పులు చేయడం ఏంటి అని భక్తులు అనుకుంటున్నారు. కాణిపాక ఆలయం పునర్నిర్మానం తర్వాత ఆగస్టు 21 కుంబాభిషేకం రోజు నుంచి ఇప్పటి వరకు వరుస వివాదాలతో ఆలయానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రవర్తిస్తున్న వారిపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. కట్టమంచికి చెందిన విజయలక్ష్మి అనే భక్తురాలు కాణిపాకం అనుబంధాలయమైన మణికంఠేశ్వర స్వామి వారి ఆలయానికి సోమశేఖర్ గురుకుల్ వారి దగ్గర లక్ష రూపాయలు ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. నిజంగా ఆ భక్తురాలు ఆరోపించినట్లు స్వామి వారికి లక్ష రూపాయలు ఇచ్చి ఉంటే తన వద్ద ఉన్న ఆధారాలు ఎందుకు మీడియాకు చూపించలేకపోయారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది? గతంలో నుంచి ఇప్పటి వరకు కాణిపాకం వినాయక స్వామి వారి ఆలయం అనుబంధ ఆలయాలకు భక్తులు ఇచ్చిన వెండి బంగారు ఆభరణాలు అన్ని నిజంగా ఆలయ అధికారుల దగ్గరే ఉన్నాయా అనే అనుమానం భక్తులలో రోజు రోజుకి సన్నగిల్లుతుంది.
ప్రధాన అర్చకులు ధర్మేశ్వర్ గురుకుల్ సస్పెండ్..
ఆలయంపై ఇన్ని ఆరోపణలు వస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారే అనే అనమానం చాలా మందికి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని అందులో వాస్తవం ఎంత అనేది భక్తులకు తెలపాలని కోరుతున్నారు. దాతల ఆరోపణపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశం తెలిపారు. అలాగే సోమశేఖర్ గురుకులపై దాతలు చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. బుధవారం ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చిత్తూరుకు చెందిన విజయలక్ష్మి దాత సోమశేఖర్ గురుకులపై కొన్ని ఆరోపణలు చేసినట్లు తెలిపారు. సమగ్ర విచారణ నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. దినదినాభివృద్ధి చెందుతున్న కాణిపాకం దేవస్థానంలో ఇటీవల దాతలు అందజేసిన విరాళాలపై వచ్చిన ఆరోపణలపై ఆలయ ప్రధాన అర్చకులు ధర్మేశ్వర్ గురుకుల్ ని ఇది వరకే సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.
కౌంటర్లు, హుండీల్లో మాత్రమే కానుకలు, విరాళాలు వేయాలి..
ఇది ఇలా ఉండగా భక్తులు ఎవరైనా తమ కానుకలు లేదా విరాళాలను దేవస్థానం హుండీ ద్వారా కానీ నేరుగా కానీ అందజేయాలని సూచించారు. విరాళ ధాతలు డొనేషన్ కౌంటర్ ద్వారా సంప్రదించి విరాళాలకు సంబంధించిన రసీదులను అప్పటికప్పుడు పొందాలని సూచించారు. విరాళాలకు సంబంధించి రసీదులను సకాలంలో ఇవ్వకుంటే తగిన ఆధారాలతో నేరుగా ఈవోకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే భక్తులు దాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్చకుల ద్వారా కానీ మధ్యవర్తులు ద్వారా కానీ విరాళాలను, కానుకలను ఇవ్వరాదని పేర్కొన్నారు. అలాంటి విరాళాలకు దేవస్థానం బాధ్యత వహించదని ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశం తెలిపారు. ఆలయ అర్చకులు కూడా భక్తుల నుంచి నేరుగా విరాళాలను, కానుకలను నేరుగా స్వీకరించరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇది వరకే ఆర్చకులు అందరికి జీవో జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కోట్లాది రూపాయల అంచనాలతో దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. ఇందుకు భక్తులు, విరాళ దాతలు సహకారం అందించాలని కోరారు.