Kanipakam: కాణిపాకం అర్చకుడి ఇంట్లో జింక చర్మం, బిత్తరపోయిన అధికారులు!
వరదరాజ స్వామి ఆలయం వీరాంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్న కృష్ణమోహన్ అనే అతని ఇంటిపై తనిఖీలు చేస్తుండగా రెండు జింక చర్మాలు పట్టుబడ్డాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అర్చకుడి ఇంట్లో జింక చర్మం లభ్యం కావడం విస్మయం కలిగిస్తోంది. ఈవో వెంకటేశ్ జరిపించిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాణిపాకం ఆలయ ఈవో వెంకటేశ్ కు ఇంటి దొంగలు పట్టుబడడంతో పాటుగా అర్చకుడి ఇంటిలో జింక చర్మంను గుర్తించడం చర్చనీయాంశంగా మారింది.
వరదరాజ స్వామి ఆలయం వీరాంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్న కృష్ణమోహన్ అనే అతని ఇంటిపై తనిఖీలు చేస్తుండగా రెండు జింక చర్మాలు పట్టుబడ్డాయి.. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) చైతన్య కుమార్ రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ అధికారులు జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ద్వారా జింకచర్మాన్ని తాను కొన్నట్లుగా కృష్ణమోహన్ విచారణలో చెప్పారని అధికారులు చెప్పారు. అతనికి విక్రయించిన వ్యక్తి కోసం వెతుకుతున్నామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు.
స్వయంగా కాపు కాసి నిందితుల్ని పట్టేసిన ఈవో
ఆలయ అన్నదాన సత్రం పోటు నుండి సరకులను అక్రమంగా తరలించారనే ఆరోపణలతో ఉద్యోగుల ఇళ్లపై ఆకస్మికంగా తనిఖీలు జరిగాయి. సుమారు ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే సరకులు నిత్యాన్నదాన సత్రం స్వామివారి ప్రసాదం తయారీ పోటు నుంచి తరలించినట్లు ఆలయ ఈవోకు సమాచారం అందింది. దీంతో ఆయన శనివారం తెల్లవారుజామున ఆలయ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అన్నదాన సత్రంలోని సిబ్బంది ఇళ్ళపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దేవస్థానం అన్నదాన భవన్లో పని చేసే వంట మనుషులు ఆలయ ప్రసాదం పోటులో పని చేసే బ్రాహ్మణులతో కలిసి ఏడు మంది ఈ సరుకులను అక్రమంగా తరలించి తమ తమ ఇండ్లలో నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. తనిఖీలు చేసి అక్రమంగా అన్నదాన సత్రం నుండి తరలించిన సరకులను స్వాధీనం చేసుకున్నారు.
నిత్యం 2,500 మందికి సరిపడా అన్నదానానికి కావాల్సిన సరకులు, సేవల ప్రసాదాలకు గోడౌన్ నుంచి ముందురోజు తీసుకెళ్తారు. వాటిలో కొన్నింటిని చేతివాటం కల సిబ్బంది ఇళ్లకు తరలిస్తున్నారు. దీంతో ఈవో రహస్యంగా అన్నదాన భవనం వద్ద కాపు కాసి, సరకులు తరలిస్తున్న బైక్ ను వెంబడించి వంట మనిషి ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ సరకులు గుర్తించారు. మిగిలినవారి ఇళ్లలో తనిఖీ చేయగా రూ.1.30 లక్షల విలువైన సరకులు బయటపడ్డాయి. అన్నదాన సత్రం నుండి సరకులను అక్రమంగా తరలించిన ఏడుగురిపై విచారణ అనంతరం శాఖా పరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆలయ ఈవో సిద్దం అయ్యారు.