CM Jagan Kuppam Tour: కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీరు- చెరువుల్లోకి విడుదల చేయనున్నసీఎం జగన్
Krishna Water: కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలి రానున్నాయి. ఆ జలాలను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు చెరువుల్లోకి విడుదల చేయనున్నారు. పాలార్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
Kuppam Water: రాష్ట్రానికి చిట్టచివరి ప్రాంతం..రాయలసీమలోని కరవు తాండవించే కుప్పం ప్రాంతానికి కృష్ణమ్మ తరలివెళ్లింది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా కుప్పం (Kuppam)బ్రాంచ్ కెనాల్ కు నీరు విడుదల చేయగా గంగమ్మ రామకుప్పం మండలానికి చేరింది. నేడు కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్(Jagan) రామకుప్పం మండలం రాజుపాలెం నుంచి మద్దికుంటచెరువు నాగసముద్రం చెరువు, మనేంద్రం చెరువు, తొట్లచెరువుకు నీటిని విడుదల చేయనున్నారు.
బిరబిర కృష్ణమ్మ
ఎక్కడ శ్రీశైలం(Srisaiam) ఎక్కడ కుప్పం..అయినా సరే ఎండుతున్న గొంతులను తడిపేందుకు, నెర్రలిచ్చిన భూములను తన స్పర్శతో పావనం చేసేందుకు కృష్ణమ్మ పరుగులెట్టింది. ఎన్నో ఎత్తుపల్లాలు, అడ్డంకులను అధిగమించి దుర్భిక్ష ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకుంది. హంద్రీనీవా (Handhri-Neeva) ప్రాజెక్ట్‌లో భాగంగా శ్రీశైలం నుంచి కుప్పానికి కృష్ణా జలాలు తరలి వెళ్లాయి. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వ హయాంలో పనులు పరుగులు పెట్టాయి. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు (Punganoor)బ్రాంచ్ కెనాల్‌లో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం అప్పినపల్లి వద్ద రోజుకు 216 క్యూసెక్కులను మూడు దశల్లో ఎత్తిపోసి.. 123 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి గ్రావిటీ ద్వారా తరలించి 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించేందుకు శరవేగంగా పనులు సాగాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో జగన్(Jagan) హయాంలో మిగిలిన పూర్తి చేశారు.
పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్ కెనాలకు కృష్ణా జలాలను ఎత్తిపోశారు. ప్రస్తుతం రామకుప్పం మండలానికి నీరు చేరగా అక్కడి నుంచి నేడు చెరువులను సీఎం జగన్ నీటిని విడుదలచేయనున్నారు. నేడు మద్దికుంటచెరువు, నాగసముద్రం చెరువు, మనేంద్రం చెరువు, తొట్లచెరువుకు నీటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యక్రమంలో మిగితా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు.
పాలార్ రిజర్వాయర్ నిర్మాణం
కుప్పం నియోజకవర్గంంలో శాశ్వతంగా సాగునీటి సమస్యను పరిష్కరించేలా కుప్పం మండలం గణేశ్వరపురం వద్ద పాలార్ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ నేడు శంకుస్థాపనం చేయనున్నారు. రూ.214.81 కోట్లతో పాలార్ రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు శుక్రవారం పరిపాలనా అనుమతినిస్తూ జీఓ జారీచేశారు. దీంతోపాటు కుప్పం బ్రాంచ్ కెనాల్‌లో అంతర్భాగంగా గుడిపల్లి మండలం యామిగానిపల్లి వద్ద 0.710 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించడం.. శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించే పనులు చేపట్టడానికి రూ.535.435 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్...మూడేళ్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపి కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు కైవసం చేసుకున్నారు. చివరకు చంద్రబాబును సైతం ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు కుప్పం ప్రజలకు, సాగు, తాగు నీరు అందించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ఎన్ని పోటీలు పడినా...తమకైతే నీరు రావడం పట్ల కుప్పం ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.