CJI NV Ramana: డాలర్ శేషాద్రికి నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి లోనైన సీజేఐ ఎన్వీ రమణ
నలభై ఏళ్లకు పైగా శ్రీవారి సేవలో తరించిన డాలర్ శేషాద్రితో వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉందని, ఆయన లేకపోవడం తమ కుటుంబానికి చాలా కష్టంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.
తిరుపతి : శ్రీవారికి అత్యంత ప్రియభక్తుడు శేషాద్రి స్వామి అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం నాడు తిరుమలకు విచ్చేసిన ఆయన డాలర్ శేషాద్రి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. శేషాద్రి స్వామి సతీమణిని ఎన్వీ రమణ పరామర్శించారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. డాలర్ శేషాద్రితో తనది 25 ఏళ్ల అనుబంధమని.. తిరుమలలో శేషాద్రి లేడు అనే వార్త ఊహించుకోవడం చాలా కష్టతరంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడ ఆయన లేని ఫోటో తీసుకోవడం బాధాకరం అన్నారు.
‘నలభై ఏళ్లకు పైగా శ్రీవారి సేవలో తరించిన డాలర్ శేషాద్రితో వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది. ఎప్పుడూ నా కుటుంబంతో పాటు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించే అలాంటి పలకరింపు ఇకపై ఉండదు. నాకు నాకుటుంబ సభ్యులకు శేషాద్రి లేని లోటు ఎంతో నష్టం. శేషాద్రి స్వామి అనారోగ్యం కూడా లెక్క చేయకుండా స్వామి వారి సేవలో తరించాలి అని భావించేవారు. స్వామి వైభవాన్ని, ప్రాచీన సంప్రదాయాలను ఆయన పుస్తకం రూపంలో ప్రచురించడం గొప్ప విషయం. రాబోయే తరాలకు టీటీడీ ఆ పుస్తకాలను అందించాలి. శేషాద్రి స్వామి రూపంలో ఉన్న ఆ పుస్తకంను, అమూల్యమైన సందేశాలను మనం వినియోగించుకోవాలని’ సీజేఐ ఎన్వీ రమణ సూచించారు.
చిన్నవారినైనా,పెద్దరినైనా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి శేషాద్రి స్వామి అని.. చివరి క్షణాల వరకూ స్వామి వారికి సేవ చేస్తూ, స్వామి వారిలో ఐక్యం కావడం ఆయన అదృష్టమని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యుల తరపున శేషాద్రి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ జేఈవో బాలసుబ్రహ్మణ్యం శేషాద్రి స్వామిని తనకు పరిచయం చేయగా.. ధర్మారెడ్డి, శ్రీనివాసురాజులుతో కలిసి తమ అనుబంధం కొనసాగిందని గుర్తు చేసుకున్నారు.
Also Read: Dollar Seshadri: పాల శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు సుపరిచితులు!
ఎన్వీ రమణతో ప్రత్యేక అనుబంధం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో డాలర్ శేషాద్రి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. తిరుమల పర్యటన సందర్భంగా ఎన్వీ రమణ ప్రతిసారి శేషాద్రి స్వామి ఇంటికి వెళ్లేవారు. ఇటీవల తిరుమలను సందర్శించిన సమయంలో.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని శేషాద్రి స్వామికి సూచించారు. మరోసారి తిరుమలకు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారు. కానీ ఇలా చూడాల్సి వచ్చిందని సీజేఐ భావోద్వేగానికి లోనయ్యారు.
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటు రావడంతో విశాఖలో హఠాన్మరణం చెందారు. ఆయన పార్థీవదేహాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీకి తరలించగా.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి నేటి వేకువజామున తిరుపతికి చేరింది. నేటి ఉదయం ప్రజల సందర్శనార్థం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్‌లో శేషాద్రి పార్థీవదేహాన్ని ఉంచగా.. ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. తిరుపతి గోవిందదామంలో అంతిమ సంస్కారాలు జరిపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Also Read: YV Subba Reddy: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం