(Source: ECI/ABP News/ABP Majha)
Chittoor District News: గజరాజుల దాడిలో పూర్తిగా నాశనమైన వరి పంట, ఆందోళనలో అన్నదాతలు!
Chittoor District News: చిత్తూరు జిల్లా కడతట్లపల్లి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించింది. పంట పొలాలను తొక్కి నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Chittoor District News: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కడతట్ల పల్లి గ్రామ సమీపంలోని బోడెనేగట్టు వద్ద గల పంట పొలాల్లో ఓ ఏనుగుల గుంపు సంచరించింది. మొత్తం 15 ఏనుగులు సమీలా, రాజేష్ పంట పొలాన్ని తొక్కి నాశనం చేశాయి. గురువారం రోజు వేకువజామున ఏనుగులు వీరంగం సృష్టించాయి. మొత్తం ఐదు కొబ్బరి చెట్లు, ఒక ఎకరా వరి పంట పొలాన్ని తొక్కిసలాటలో పూర్తిగా ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు పాడు చేయడం బాధాకరం అంటున్నారు. అటవీ శాఖ అధికారులు ఎన్ని అడ్డుకట్టులు వేసినప్పటికీ... గజరాజుల దాడులు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. నష్టపోయిన రైతన్నలకు నష్ట పరిహారం అందించిన పాపాన కూడా పొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం వాటిల్లినప్పుడు వస్తున్న అధికారులు... సంఘటనా స్థలంలో సాయం చేస్తామని హామీలు ఇవ్వడం ఆ తర్వాత కనిపించకుండా పోవడం పరిపాటిగా మారిందంటూ అటవీ సరిహద్దు ప్రాంతాల రైతన్నలు వాపోతున్నారు.
గజరాజుల దాడిలో నష్టపోయిన రైతన్నలు కార్యాలయాల చుట్టు తిరిగి కాళ్లు అరిగాయే తప్ప... ప్రభుత్వ నుంచి పైసా కూడా అందలేదని రైతన్నలు మొర పెట్టుకుంటున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల శివారున ఏనుగులు కనీసం నెలలో మూడు సార్లు దర్శనం ఇస్తున్నాయి. ఏనుగుల నుండి తమ పంట పొలాలకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
మన్యం జిల్లాలో ఏనుగుల మంద బీభత్సం...
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో నెల రోజుల క్రితం ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. గంగులువాని చెరువు దగ్గర ఉన్న 2 ఆవులను, ఒక లేగ దూడను ఏనుగులు తొక్కి చంపాయి. మరోవైపు మిర్తివలసలోనూ ఆవుల మందపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే భయబాంత్రులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. గత నాలుగు ఏళ్లుగా మన్యం వాసులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఏనుగుల దాడిలో వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని, మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.
మొన్నటికి మొన్న జిల్లాకు వచ్చిన ఏనుగులు..
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో నాలుగు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలన్నీ నాశనం చేశాయి. విజయనగరం జిల్లా రాజాం మండలంలో ఉన్న ఈ ఏనుగురు అర్ధరాత్రి 25 కిలోమీట్లర మేర ప్రయాణం చేసి వెంగాపురం గ్రామ సమీపంలోని పంటపొలాలపై పడి పరుగులు పెట్టాయి. తొక్కి తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల అరుపులతో విషయం గుర్తించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చేతికి వచ్చిన పంటను నాశనం చేయడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. అయితే అవే ఏనుగులు మరోసారి ఆవులు, లేగదూడపై దాడి చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.