Chevireddy Mohith Reddy: గడపగడపకు ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారుడు - 205 రోజులు 2014 గ్రామాల్లో పాదయాత్ర
Chevireddy Mohith Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2014 గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించనున్నారు.
Chevireddy Mohith Reddy: తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర మొత్తం 7 నెలల పాటు సాగనుంది. ఆరు మండలాలు, 2014 గ్రామాలు, 1600 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని ప్రభుత్వ హైస్కూల్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మహా పాదయాత్ర ప్రారంభానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహా పాదయాత్ర కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.
చంద్రగిరి నియోజకర్గ ప్రజల సంక్షేమం, సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా 'గడప గడపకు మహా పాదయాత్ర' కార్యక్రమం ప్రారంబించాను. మీ బిడ్డగా మీలో ఒక్కనిగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ప్రజల ఆశీస్సులు, దేవుని దయ, అమ్మ నాన్నల దీవెనలతో మహా పాదయాత్రను విజయవంతం చేస్తాను. pic.twitter.com/ef0vQHWKMS
— Chevireddy Mohith Reddy (@ChevireddyMohit) October 7, 2022
మహా.. పాదయాత్ర!
"ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ అన్న ప్రభుత్వానికే దక్కుతుంది. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచాడు. 43 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రెవెన్యూ సదస్సు, అభివృద్ధి సదస్సు చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించుకున్నాం. నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించిన ఘనత జగన్ అన్న ప్రభుత్వానిది. చంద్రగిరి నియోజవర్గంలో గ్రామ సమస్యల్ని తెలుసుకుంటున్నాం. పాకాల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో బుధవారం నేను ప్రారంభిస్తా. తిరుపతి ఎంపీపీ హోదాలో నా కుమారుడు మోహిత్ రెడ్డి మహా పాదయాత్ర ద్వారా ప్రతి గడప గడపకు పంపిస్తున్నా. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో చంద్రగిరి నియోజకవర్గంలో మహా పాదయాత్రకు మోహిత్ రెడ్డి ద్వారా శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో ఒక నియోజక వర్గంలో ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేసి ఉండరు. ఇదే మొదటిది కావడం నిజంగా గొప్ప విషయం" అని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
ప్రజలకు చేరువవుతాం
"సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నాము. లక్షా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమం పేరుతో ప్రజలు ఖాతాల్లో జమ చేసింది జగనన్న ప్రభుత్వం. మూడున్నర ఏళ్ల పాలన కాలంలో దేశంలో ఏ ఒక్కరూ ఇలా చేసి ఉండరు. రెండు కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వం సంక్షేమం పథకాలు అందుకుంటున్నారు. సీఎం జగన్ ఒకటే చెప్పారు. కులం, మతం, ప్రాంతం అని చూడకుండా ఆర్హతలే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. 29 లక్షల ఇళ్లు, 55 వేల కోట్ల ఖర్చుతో కట్టిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్, చరిత్రలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా పెద్ద సంఖ్యలో పేదలకు ఇళ్లను అందిస్తున్నారు. రాష్ట్రంలో 87 శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దేశ రాజకీయాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు. ఇంత చిన్న వయసులో మోహిత్ రెడ్డి మహా పాదయాత్ర చేయడాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నా. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ నియోజకవర్గంలో మహా పాదయాత్ర ద్వారా ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తాడు. పెద్దలు సహకారంతో పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గర అవుతాను" అని పాదయాత్ర ప్రారంభం సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
తండ్రి ఆశయాలు, ఆశీర్వాదంతో ప్రజల ముందుకు వస్తున్న మోహిత్ రెడ్డికి తన ఆశీస్సులు ఉంటాయని డిప్యూటి సీఎం నారాయణ స్వామి అన్నారు. దుర్గమ్మ గుడికి వెళ్ళి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. చంద్రబాబుది రాక్షస హృదయమని.. పగ, కుట్ర, ద్వేషంతో పుట్టిన వ్యక్తి చంద్రబాబు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. ప్రేమ, ఆప్యాయతతో పుట్టిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. చంద్రబాబు వార్డు సెక్రటరీ, వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని అంటున్నారని.. మహిళలకు లోన్లు తీసేస్తానని చెబుతున్నారని, జన్మభూమి కమిటీలు వేస్తామని అంటున్న చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పాలని నారాయణ స్వామి కోరారు.