ఏడు కొండలు వాడా క్షమించు-ఏర్పాట్లు చేయలేకపోయాం- పురందేశ్వరి సంచలన స్టేట్మెంట్
BJP Reacts On Tirumala Stampede Issue: తిరుమలలో జరిగిన దుర్ఘటనపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఘాటుగా స్పందించారు. ఉన్నత స్థాయి దర్యాప్తునకు డిమాండ్ చేశారు. దేవుడిని క్షమించమని వేడుకున్నారు.
తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తిరుమల తిరుపతి చరిత్రలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా పాలక మండలి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు...
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో భక్తులు మృతి చెందడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచి వేసింది అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. బాధితకుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేవుడా క్షమించు తగిన ఏర్పాట్లు చేయలేకపోయామంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.