Peddireddy On Chandrababu: ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పంలో ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా? : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
మూడేళ్ళలో కుప్పంకు కేవలం 6 సార్లు మాత్రమే చంద్రబాబు వచ్చారని పేర్కొన్న పెద్దిరెడ్డి.. 30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థి శూన్యం అన్నారు.
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియదా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ళలో కుప్పంకు కేవలం 6 సార్లు మాత్రమే చంద్రబాబు వచ్చారని పేర్కొన్న పెద్దిరెడ్డి.. 30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం అన్నారు. కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు - సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కుప్పంలో చంద్రబాబు పేదల కోసం కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు కుప్పం పర్యటనపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
వైసీపీ కార్యకర్తలపై దాడి టీడీపీ నేతల పనే.. !
టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ కార్యకర్తలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. మూడు రోజుల చంద్రబాబు పర్యటనలో అధికంగా గాయపడింది వైసీపీ కార్యకర్తలేనని.. బయటి వ్యక్తులను తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందుతున్నాయి కనుక వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
కుప్పంలో 7వేల ఇళ్లను నిర్మించి ఇచ్చాం..
చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 7 వేల ఇళ్లను నిర్మించి ఇచ్చిందని, త్వరలో మరో 3 వేల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పంలో ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా..? అని చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. బ్యానర్లు చించి, రాళ్ళతో వైసీపీ కార్యకర్తలను కొట్టారు. నారా లోకేష్ మంగళగిరిలోనే ఘోరంగా ఓడిపోయారు. కుమారుడు లోకేష్‌ను గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు.. తన హోదాను తానే దిగజార్చుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా ఏపీ ప్రభుత్వ పనులను అడ్డుకోవడం మానివేయాలని, కుప్పంలోనూ ఉన్న పేరు పోతుందంటూ హెచ్చరించారు.
చిత్తూరులో అన్ని స్థానాలు గెలుస్తాం..
‘చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుస్తాం. వైసీపీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తున్నాడు. చంద్రబాబు కుప్పంలో పర్యటించిన 15 రోజులు బ్లాక్ డేనే. నీతి మాలిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. టీడీపీ అధినేత మానసిక పరిస్థితి బాగా లేదు. చంద్రబాబును వెంటనే కుటుంబ సభ్యులు వైద్యుడికి చూపించాలి. నిబద్ధత లేని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గెలిపించరని’ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు భద్రత పెంపు..
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భద్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటిస్తున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు వంటివి అధికం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు భద్రతపై ఎన్.ఎస్.జీ ప్రత్యేక దృష్టి సారించింది. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్న చంద్రబాబుకి 12+12 భద్రత ఏర్పాటు చేసింది.