(Source: ECI/ABP News/ABP Majha)
Narayana Swamy: దేవుడికైనా వెన్నుపోటు పొడుస్తారు - తిరుమలలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
దేశ చరిత్రలోనే అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అందజేసే నాయకుడు సీఎం జగన్ ఒక్కరేనని నారాయణ స్వామి అన్నారు.
చంద్రబాబు మ్యానిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అందజేసే నాయకుడు సీఎం జగన్ ఒక్కరేన్నారు.
శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకుల మాటలను ఖండిస్తున్నామన్నారు. పేద వారి సంక్షేమం, అభివృద్ధికి ఎప్పుడైన కృషి చేసి ఉంటే బీజేపీ నాయకులు ఇలా మాట్లాడరని ఆయన ఆరోపించారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలను బిజెపి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని, జగన్ అవినీతిపరుడు అంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు. మూడు పర్యాయాలు సీఎంగా పని చేసిన చంద్రబాబు మేనిఫెస్టో మోస పూరితమైనదని, దేవుడినైనా, ప్రజలనైనా వెన్నుపోటు పొడవడమే పనిగా చంద్రబాబు ఉన్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండాలా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పిన ఆయన,పవన్ కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా ఎందుకు ఉపయోగం లేదన్నారు. జగన్ పరిపాలన దెబ్బ తీయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉన్నారని, బహిరంగ సభలో నేను సీఎం కాలేనని స్వయంగా పవన్ కళ్యాణే ప్రజల ముందు ఒప్పుకున్నారని నారాయణ స్వామి చెప్పారు.
శ్రీవారి సేవలో వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.
దేశంలోని రాజకీయ పార్టిలు మ్యానిఫెస్టోను ప్రజలను మభ్య పెట్టే కాగితంలా మాత్రమే చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్తులతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ. . టిటిడి ఆధ్వర్యంలో ఆది జాంబవంతుడి ఆలయంను నిర్మించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వేడుకోవడం జరిగిందన్నారు.
ఒంటిమిట్ట రామాలయం నిర్మించింది ఆది జాంబవంతుడే అని, అలాంటి ఆది జాంబవంతుడుకి ఒక్క దేవాలయం లేకపోవడం చాలా బాధాకరమన్నారు. గుంటూరు అరుంధతి దేవాలయం నిర్మించేందుకు స్వామి వారిని సహకరించాలని ప్రార్ధించడం జరిగిందని, మన రాష్ట్రంలో రాజకీయ పార్టిలు మ్యానిఫెస్టో అంటే ప్రజలను మభ్య పెట్టే కాగితంలా చూసారని, కానీ మొట్టమొదటి సారి పేదల అభివృద్ధి కోసం జగన్ నవరత్నాలు అనే మ్యానిఫెస్టోను ప్రవేశ పెట్టారని అన్నారు. నవరత్నాల్లో పొందు పరిచిన ప్రతి ఒక్క హామీ జగన్ నెరవేర్చారని ఆయన చెప్పారు. మ్యానిఫెస్టోలో లేని సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్ పేదలకు అందించడం జరిగిందని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.