Paritala Sriram: చంద్రబాబునే అరెస్ట్ చేశారు, ఆ రాక్షసుడికి మేము ఎంత ? పరిటాల శ్రీరామ్ సంచలనం
TDP leader Paritala Sriram: ఏపీలో ఒక రాక్షసుడు ఉన్నాడని, ఆ రాక్షసుడిని గెలవాలంటే ఇటువైపు ఉన్న వాళ్లంతా ఏకం కావాల్సిందే అందులో భాగంగానే టీడీపీ - జనసేన పొత్తు (TDP Janasena) అని చెప్పారు.
Anantapur News : అనంతపురం: ఏపీలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని, అన్యాయంపై న్యాయం గెలవాలంటే ప్రతి ఒక్కరు ఏకం కావాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) అన్నారు. రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉన్నాడని, ఆ రాక్షసుడిని గెలవాలంటే ఇటువైపు ఉన్న వాళ్లంతా ఏకం కావాల్సిందే అందులో భాగంగానే టీడీపీ - జనసేన పొత్తు (TDP Janasena) అని చెప్పారు. టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటం కచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని పరిటాల శ్రీరామ్ ఆశాభవం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా టీడీపీ నేతల్ని అరెస్టు చేయడం కొత్త కాదని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్టు చేశారు వాళ్లకు మేము ఎంత అంటూ వ్యాఖ్యానించారు. తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలంతా ఏకం కావాలని, అరెస్టై జైలుకు వెళ్లిన నేతలు బయటకు వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామాల్లో విష సంస్కృతి పోవాలి: పరిటాల శ్రీరామ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో దశాబ్దాల కాలంగా ఉన్న ఫ్యాక్షన్ కక్షలను రూపుమాపేందుకు ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. గ్రామాలలో ఫ్యాక్షన్ ఇతర కక్షలతో పచ్చని చెట్లను నరికే విష సంస్కృతికి చెక్ పెట్టేందుకు ఇంటింటికి ఒక చెట్టు అంటూ పరిటాల శ్రీరామ్ పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో కక్షలతో చెట్లను నరుక్కుంటూ పోతే వాటి మీద ఆధారపడి ఉన్న రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో ఈ మధ్యకాలంలో చెట్లు నరికే సంస్కృతి ఎక్కువ అవుతుందని దీనివల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందుకోసమే పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కను పంపిణీ చేస్తూ వారిలో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పరిటాల శ్రీరామ్ తెలిపారు.
గతంలో పరిటాల రవీంద్ర ఉన్నప్పుడు కూడా ఫ్యాక్షన్ గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారని గ్రామాలలో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించి రాజీ కూడా కుదిర్చారని ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ వెల్లడించారు. గ్రామాల్లో నెలకొన్న వర్గ పోరులను రాజీ కుదిర్చి గ్రామాలను శాంతియుతంగా ఉండేలా పరిటాల రవి ఎంతో కృషి చేశారని.. అదే పోరాటంలోనే ఆయన మరణించారని తెలిపారు. పరిటాల రవి చూపిన బాటలోనే గ్రామాల్లో కక్షలు వర్గ పౌరులు లేకుండా ఉండేందుకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి విష సంస్కృతి పోయి ఇలా చేసేవారిలో మార్పు రావాలని.. వారి మనసులు మారాలని పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు.
నిన్న రాత్రి బీటెక్ రవి అరెస్ట్!
పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్ రవి (Btech Ravi)ని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. గతంలో నారా లోకేష్ (Nara Lokesh) వైఎస్సార్ జిల్లా పర్యటన సందర్భంగా కడప ఎయిర్ పోర్ట్ (Kadapa Airport) వద్ద పోలీసులపై బీటెక్ రవి దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ షరీఫ్‌తెలిపారు. డీఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. లోకేష్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని తెలిపారు. దానిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు వివరించారు. 10 నెలలుగా బీటెక్ రవి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు అరెస్టు చేశామన్నారు.