Fake FB Account: మహిళ ఫేస్‌బుక్ అకౌంట్‌తో యువకుడి ఛాటింగ్- విషయం తెలిసిన వివాహితులు షాక్
ఓ వివాహిత పేరిట ఫేస్ బుక్‌లో అకౌంట్ తెరిచాడు. ఓ మహిళగా అందరితో ఛాటింగ్ చేశాడు. ఆ తరువాత అమాయక మహిళలను ఏం చేసేవాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం, దిగువమారేడిపల్లెకు చేందిన అనిల్(24) అనే యువకుడు తిరుపతిలో డిగ్రీ వరకూ చదివాడు. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు పెండింగ్ ఉండడంతో సొంతూరు చేరుకున్నాడు. కొంతకాలం పాటు ఖాళీగా ఇంటి వద్ద ఉన్న అనిల్ ఏదో ఒక జాబ్ చేయాలని నిర్ణయించుకుని ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు.
చాలా ప్రయత్నాల తర్వాత బంగారుపాళ్యం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం దొరికింది. అక్కడ పని చేస్తున్న క్రమంలో అమ్మాయిలపై మోజు పెరిగింది. అక్కడి వారితో మాట్లాడాలని... వారితో కలిసి తిరగాలనే కోరిక కలిగింది. కానీ కంపెనీలో పని చేసే యువతులు ఎవరూ అనిల్‌ను పట్టించుకోలేదు. ఇలా అందర్నీ టార్గెట్ చేస్తే లాభం లేదనుకున్న అనిల్ ఓ మహిళను టార్గెట్ చేశాడు.
ఐరాల మండలానికి చెందిన వివాహితపై అనిల్ కన్నేశాడు. ఎలాగైనా ఆ వివాహితను పరిచయం చేసుకుని ఆమెను లొంగదీసుకోవాలని ట్రై చేశాడు. అందుకు ఆ వివాహిత ఒప్పుకోలేదు. దీనికి స్ట్రైట్ రూట్‌లో వెళ్తే పని జరగదని... షార్ట్ కట్ వెతుక్కున్నాడు.
అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని.. ఆ రూట్‌లోనే వెళ్లి తన కోరిక తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఓ వివాహిత పేరు మీద గతేడాది సెప్టెంబర్‌లో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. తానూ టార్గేట్ చేసిన వివాహిత ఫేస్ బుక్ ఐడీ సంపాదించి ఆమెకు ఫ్రెండ్ రిక్వస్ట్ పంపించాడు. ఆమెతోపాటు ఆ కంపెనీలో పని చేస్తున్న మిగతా వాళ్లకి కూడా రిక్వస్ట్ పంపాడు.
మహిళ పేరు ఉండటంతో వచ్చిన రిక్వస్ట్‌లను చాలా మంది యాక్సెప్ట్ చేశారు. వాళ్లందరితో మహిళ పేరుతో కొంత కాలం ఛాటింగ్ చేశాడు అనిల్. వారికి పూర్తిగా నమ్మకం ఏర్పడిన తరువాత అనిల్ తనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ బయటకు తీశాడు. వారికి అసభ్యకర పదజాలంతో మెసేజులు చేస్తూ, అశ్లీల ఫోటోలు,పదాలు పంపేవాడు. అంతటితో ఆగకుండా వారి ఫోటోలను ఫేస్ బుక్ నుంచి డౌన్ లోడ్ చేశాడు. వాటికి మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగాడు. వారిని లోబరుచుకునే ప్రయత్నాలు చేశాడు. ఈ విషయాన్ని గమనించి ఐరాల మండలానికి చెందిన ఓ వివాహిత మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగ్గిన పోలీసులు ఏం చేసారంటే...??
వివాహిత ఫిర్యాదుతో ఫేక్ ఫేస్ బుక్ పై దర్యాప్తు ప్రారంభించారు ఐరాల పోలీసులు.. అనిల్ ఓ వివాహిత పేరుతో క్రియేట్ చేసిన ఐడీ అడ్రస్‌తో ఐరాల పోలీసులు రహస్యంగా ఆరా తీశారు. బంగారుపాళ్యానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న అనిల్ ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలను మభ్య పెడుతున్నట్లు గుర్తించారు. దీంతో దిగువమారేడిపల్లె గ్రామంలో అనిల్ ఉండగా ఐరాల పోలీసులు అరెస్టు చేశారు.. అనిల్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫేక్ ఫేస్ బుక్ ఐడీలతో మహిళలు అప్రమత్తం ఉండాలి..
ఫేస్‌బుక్‌ను వినియోగించే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మభ్య పెట్టే వారి మాయమాటల్లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.. ఇలాంటి ఘటనలు ఏవైనా ఉంటే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, రహస్యంగా దర్యాప్తు సాగించి మోసగాళ్ళ బరి నుంచి కాపాడుతాంమని పోలీసులు అంటున్నారు..