Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అసలు తప్పెవరిది? - సీఎం చంద్రబాబుకు నివేదిక, ఏ సమయంలో ఏం జరిగిందంటే?
Tirupati News: తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి నివేదికను సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందించారు.
Tirupati Stampede Incident Full Details: పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించిన వారు టోకెన్లు తీసుకునే లోపే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట (Tirupati Stampede) ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. అసలు ఈ దుర్ఘటనకు సంబంధించి తప్పు ఎవరిదనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టోకెన్లు తమ వరకూ రావేమో అని కొందరు భక్తులు అత్యుత్సాహం ఓ కారణమంటూ కొందరు వాదిస్తున్నారు. అయితే, అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా తగిన రీతిలో అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేయలేదని కొందరు విమర్శిస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహం కూడా దీనికి కారణమని భావిస్తున్నారు. ఓ సెంటర్ వద్ద భక్తురాలు అస్వస్థతకు గురి కావడంతో డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తోపులాట జరిగిందని ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) అధికారులు నివేదిక అందజేశారు.
'తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. 20 నిమిషాలైనా అతను అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు.' అని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
40 మంది డిశ్చార్జి
ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను టీటీడీ ఛైర్మన్ సహా ఈవో, జేఈవో, ఇతర అధికారులు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. 48 మంది గాయపడగా.. 40 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 8 మంది చికిత్స పొందుతున్నారు.
తాకిడి తక్కువగా ఉందని..
తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేయగా.. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని తెలపగా.. బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన భక్తులు బుధవారం ఉదయం పదింటికే అక్కడికి చేరుకున్నారు. రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. దీంతో పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి.. రాత్రి 8:20 గంటలకు క్యూలైన్‌లోకి అనుమతించారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. కొంతసేపు భక్తులను నిలిపేసి సహాయ చర్యలు చేపట్టారు. దీంతో ప్రాణనష్టం తగ్గింది. గాయపడ్డ భక్తులను అంబులెన్సులో పోలీసులు రుయా, స్మిమ్స్ ఆస్పత్రులకు తరలించారు.
ఈ కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. భక్తులను పార్కులో ఉంచి ఒకేసారి అనుమతించడంతో ప్రాణనష్టం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీ అధికారులు ఏర్పాట్లలో విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఏ టైంలో ఏం జరిగిందంటే..?
- ఉదయం 10 గంటలకు - బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భక్తుల తాకిడి పెరగడంతో శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతి.
- మధ్యాహ్న 2 గంటలు - భక్తులతో నిండిన పార్కు అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు.
- సాయంత్రం 7 గంటలకు - పార్కు పూర్తిగా నిండిపోవడంతో ఎవరూ ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది.
- రాత్రి 8:20 - పార్కు నుంచి టికెట్ల జారీ కౌంటర్లోకి అనుమతించడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా తోసుకుని రావడంతో ప్రాణ నష్టం జరిగింది.
- రాత్రి 8:40 - సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్సులు.. తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించారు. ఎస్పీ సుబ్బారాయుడు సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.