Tirupati: తిరుపతి శ్రీకృష్ణనగర్ లో వింత ఘటనలు... భూమిలోకి కుంగిపోయిన ఇళ్లు... కూల్చేందుకు సిద్ధమైన అధికారులు
తిరుపతి శ్రీకృష్ణనగర్ లో ఉద్రిక్తత నెలకొంది. బీటలు బారిన ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు జేసీబీలో సిద్ధమవ్వగా... స్థానికులు వారిని అడ్డుకున్నారు. శ్రీకృష్ణనగర్ లో భూమిలోకి 18 ఇళ్లు కుంగిపోయాయి.
తిరుపతి శ్రీకృష్ణ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఇళ్లు కుంగిపోయి బీటలు రావటంతో.. ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఇప్పుడు ఈ ఇళ్లను కూల్చివేసుందుకు అధికారులు సిద్ధమవ్వగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు జేసీబీలతో ఇళ్లను కూల్చివేసుందుకు సిద్ధమయ్యారు.
శ్రీకృష్ణ నగర్ ను పరిశీలించిన జియాలజీ ప్రొఫెసర్లు
తిరుపతి శ్రీకృష్ణ నగర్ లో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 18 ఇళ్లకు బీటలు రావటంతో అధికారులను ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలోనే నీటి సంపు ఒరలు పైకి రావటం, దీనికి తోడు ఇళ్లు బీటలు తీయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లి లోని శ్రీకృష్ణ నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్ ట్యాంక్‌ని శుభ్రం చేస్తుండగా భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చిందని తెలిపింది. శ్రీకృష్ణనగర్ ప్రాంతాన్ని ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. ఇలాంటి ఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంపు నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాల్వ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఈ కారణాలతో సంపు పైకి లేచిందని తెలిపారు.
Also Read: ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !
ఇళ్లు బీటలు.. ఆందోళనలో స్థానికులు
వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తిరుపతి నగర వాసులను వింత సంఘటనలు భయపెడుతున్నాయి. శ్రీకృష్ణ నగర్ లో శుక్రవారం భూమిలో నుంచి ఒక్కసారిగా 15 అడుగుల మేర సిమెంట్ ఒరలు పైకి వచ్చాయి. ఈ ఘటన మరవక ముందే శ్రీకృష్ణ నగర్ లోని ఓ భవనం భూమిలోకి కుంగింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే సంఘటన స్థలాన్ని తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషా పరిశీలించి భూమిలోకి కుంగిన భవనాన్ని వేంటనే కూల్చి వేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. భవనానికి చుట్టు పక్కల ఉన్న నివాసాలను ఖాళీ చేయించారు. బాధితులు తమ ఇళ్లు కూల్చేందుకు అంగీకరించమని తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పినప్పటికీ బాధితులు ఒప్పుకోకపోవడంతో అధికారులు బలవంతంగా ఇంటిని ముందస్తు చర్యల్లో భాగంగా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు
శ్రీకృష్ణనగర్ ప్రాంతం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం కావడంతో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. ఇటీవల వరదలకు నీరు పూర్తిగా వెళ్లి పోవడంతో ఆ ప్రాంతంలో దాదాపుగా 18 ఇళ్లు వరకూ భూమిలో కుంగిపోయిన స్థితిలో ఉన్నాయి. దీంతో ముందస్తుగా అధికారులు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుపతి ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరంలేదని మున్సిపల్ అధికారులు అంటున్నారు.
Also Read: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు... వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన