Naravaripalle Sankranti : నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు, సందడి చేయనున్న నారా, నందమూరి కుటుంబాలు
Naravaripalle Sankranti : తిరుపతి జిల్లా నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాలు గ్రామానికి చేరుకున్నాయి.
Naravaripalle Sankranti : నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట పండగ వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ లతో సహా నారా కుటుంబం అంతా నారావారి పల్లెకు చేరుకున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ సైతం ఇవాళ నారావారి పల్లెకి చేరుకొని సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. భారీగా వచ్చే బంధుగణానికి అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక నేతలు. రేపు(శనివారం) ఉదయం నిర్వహించే భోగి సంబరాల్లో బాలకృష్ణ, నారా లోకేష్ పాల్గొంటారు. ఇక స్థానిక నేతలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదయం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు.
నారావారిపల్లెకు బాలకృష్ణ
సంక్రాంతి సంబరాల కోసం తన వియ్యంకుడు, బావ అయిన నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లికి నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో వచ్చారు. బాలకృష్ణకు అభిమానులు, టీడీపీ నాయకులు ,కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు.
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్లల్లో వేడుకలు చూడాలనే నాడు సంక్రాంతి కానుకలు ఇచ్చామని తెలిపారు. జన్మభూమి స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి అంతా కలిసి రావాలన్నారు. క్రాంతి అంటే అభ్యుదయం అని, సంపదలు, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి అని తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగ సంక్రాంతి అని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలు పంచే అతిపెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. తెలుగు ప్రజలు పల్లె సీమలకు తరలే వెళ్లే ఆత్మీయ పండుగని గుర్తుచేసుకున్నారు. ధనిక, పేద తారతమ్యాలు మర్చిపోయి అన్ని వర్గాల ప్రజలు సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలకు పండుగ కానుకలు ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికామన్నారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకలు అందించామన్నారు.
మీడియాపై ఆగ్రహం
స్వగ్రామం నారావారిపల్లె లో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మీడియా అధికార పార్టీకి ఉంపుడు గత్తెల్లా మారిపోయిందని, వైసీపీ నాయకులు ఏమి రాయమంటే అది రాస్తున్నారని మండిపడ్డారు. ఈ సంక్రాంతి భవిష్యత్తు మీద భరోసా కోసం పోరాడే శక్తినిస్తుందన్నారు. అర్హత లేని వ్యక్తులు వైసీపీ నాయకులు అంటూ విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో సేవా భావంతో పని చేసే వ్యవస్థ రాజకీయం అన్నారు. వైసీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజం, హత్యలు, కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారని విమర్శించారు. అది చాలా తప్పని, ఆ తప్పును కూడా పోలీసులు ద్వారా కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నారన్నారు. పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్రాంతి తర్వాత తన పోరాటంలో మరింతగా స్పీడ్ పెంచుతానన్నారు.