Minister Peddireddy : కుప్పంలో చంద్రబాబు బంగారు నాణేలు పంచినా వైసీపీ గెలుపు తథ్యం : మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy On Chandrababu : కుప్పంలో చంద్రబాబు బంగారు నాణేలు పంచినా సరే ఈసారి వైసీపీ గెలవటం పక్కా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కుప్పంలో ఇళ్లు కట్టుకోవడం సంతోషం అన్నారు.
Minister Peddireddy On Chandrababu : కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టినా, బంగారు నాణేలు పంచినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు తథ్యం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం తిరుపతిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తీసుకువచ్చిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించి కొందరు మంత్రులతో కమీటీ వేసి లోపాలను సరిదిద్దిందన్నారు. ప్రస్తుతం టెండర్ల విధానంలో మార్పు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో అధికారులపై దాడులు చేసిన పట్టించుకోలేదని, చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయన్నారు.
ఇసుక అక్రమాలకు చెక్
గత ప్రభుత్వానికి రూ.100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసిందని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. ఇవాళ 750 కోట్లు ఏడాదికి ఇసుక ద్వారా ఆదాయం సమకూర్చుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎం.ఎస్.టి.సి సంస్థ ద్వారా ఇసుక దక్కించుకునే అవకాశం కల్పించామని ఆయన తెలియజేశారు. ఈఏండీ కింద రూ.120 కోట్లు కాషన్ డిపాజిట్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవకతవకలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. అంతే కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1450 ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 1400 వాహనాలు సీజ్ చేశామని, 485 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అంతా ఆన్లైన్ లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నామని, జేపీ సంస్థకు కాంట్రాక్ట్ దక్కించుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తుందన్నారు. ఎస్.ఈ.బి పూర్తి స్థాయిలో ఇసుక అక్రమాలను నియంత్రిస్తుందన్నారు.
సీఎం సంతోషం వ్యక్తం చేశారు
రాష్ట్రంలో 18 లక్షలు మంది రైతులకు విద్యుత్ మీటర్లు బిగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో 28 వేల మంది రైతుల విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించామన్నారు. వీటిలో 33.15 శాతం అదనంగా సేవింగ్ చేస్తున్నామని ఆయన వివరించారు. ఏడాదికి పది వేల కోట్ల రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈనెలాఖరు నాటికి రైతుల పేరుతో అకౌంట్స్ తెరిచి నగదు చెల్లిస్తామని, అంతే కాకుండా పూర్తి సబ్సిడీ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న నగదు పట్ల అవగాహన పెరుగుతుందని, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అసమర్ధుడు కాబట్టి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు కూడా తీసుకురాలేకపోయారన్నారు. ముప్పై ఐదు సంవత్సరాల తరువాత కుప్పంలో చంద్రబాబు ఇళ్లు కట్టుకోవడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారని, చంద్రబాబు ఏం చేసినా వైసీపీ గెలుపు తథ్యమని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.