Tirupati News : చంద్రబాబు ఓ ఆల్ ఖైదా, లోకేశ్ ఓ తాలిబన్ - పున్నూరు గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Tirupati News : పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అయిపోతామంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే అని లోకేశ్ పాదయాత్రనుద్దేశించి పున్నూరు గౌతమ్ రెడ్డి అన్నారు.
Tirupati News : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఆల్ ఖైదా, లోకేశ్ ఓ తాలిబన్ అంటూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా డాక్టర్ పున్నూరు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను తీసివేస్తామని నారా లోకేశ్ చెప్పడం దారుణమన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలుస్తోందన్నారు. ఇంతకీ 2024 ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడా, ఉత్త పుత్రుడు నారా లోకేశా, జనసేన దత్త పుత్రుడు పవన్ కళ్యాణా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అయిపోతామంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంటుందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి చేసి చూపించారన్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పాలన్నారు. అసలు దశ దిశా లేని పార్టీలు టీడీపీ , జనసేన అని ఎద్దేవా చేశారు.
ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధం
"గోబెల్స్ ప్రచారానికి చంద్రబాబు, పవన్ తెరలేపారు. ఏపీలో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ, జనసేనకు సవాల్ విసురుతున్నా..... ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధం. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చెప్పడానికి వైసీపీ తరఫున మేం సిద్ధం. చంద్రబాబు టైంలో కన్నా జగన్ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది. పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు రూ.3600 కోట్ల బకాయిలు పెడితే జగన్ అధికారంలోకి రాగానే ఆ అప్పు తీర్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీకి రూ.75645 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆరు భారీ ప్రాజెక్టులు వచ్చాయి. మరో 7 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 17 ప్రాజెక్టులు శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ టాప్ లో ఉంది." -పున్నూరు గౌతమ్ రెడ్డి
కేబుల్ ఛార్జీలు పెంచం
"కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తామన్న రాయితీ ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని భరిస్తుంది. రాష్ట్రంలో 3 పోర్టులు, 9 ఫిష్షింగ్ హార్బర్లు ఏర్పాటు చేశాం. ఒక్కొక్క ప్రాంతానికి ఎంత పెట్టుబుడులు వచ్చాయో స్పష్టంగా చెప్పగలం. పక్కా లెక్కల ప్రకారం చెబుతాం. విశాఖ, తిరుపతిలను చంద్రబాబు ఐటీ హబ్ చేస్తామని అబద్ధాలు చెప్పారు. జగన్ అలాంటి వ్యక్తి కాదు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిల్లో 98 శాతం అమలు చేశాం. జగన్ కు సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్లు. చంద్రబాబుకు 175 స్థానంలో పోటీ చేసే దమ్ము లేదు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ సింగిల్ గానే వెళ్తారు. జీఎస్డీపీలో ఏపీ ముందుంది. ట్రాయ్ ఛార్జీలు పెరిగాయని ఏపీ ఫైబర్ నెట్ కూడా ఛార్జీలు పెంచుతాయని ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా కూడా ఛార్జీలు పెరగవు. చివరి ఇంటి వరకూ ఫైబర్ నెట్ అందిస్తాం. పంచాయతీల్లో ఇంటర్ నెట్ పార్క్ ఏర్పాటుచేస్తాం. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబు, పవన్. అభివృద్ధిపై చర్చకు వస్తే అన్నీ నిరూపిస్తాం. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 25 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నాయి. "- పున్నూరు గౌతమ్ రెడ్డి