By: ABP Desam | Updated at : 03 Dec 2022 03:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుంచి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు చేశామన్నారు. దీంతో ఉదయం లభించే దాదాపు 3 గంటల సమయంలో సుమారు 15,000 మంది భక్తులకు అదనంగా సర్వదర్శనం కల్పించి వారికి వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకే ఈ ప్రణాళిక చేపట్టామన్నారు. భక్తులు ముందురోజు రావాల్సిన అవసరం లేకుండా అదేరోజు తిరుపతిలో బసచేసి, తిరుమలకు ఉదయం వచ్చి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చన్నారు. అంతకు ముందులా తిరుమలలో ముందురోజు బసచేయవలసిన అవసరం ఉండదన్నారు. దీంతో తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి ఒక నెల తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి పది రోజుల పాటు అంటే జనవరి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. రెండు సంవత్సరాల మాదిరి ఈ సంవత్సరం కూడా రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా రోజుకు 50 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 5 లక్షల సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను తిరుపతిలో కౌంటర్ల ద్వారా భక్తులకు మంజూరు చేస్తామన్నారు. ఈ సర్వదర్శనం టోకెన్లు ఎవరైనా క్యూలైన్లలో ఉండి పొందవచ్చని తెలిపారు. వారికి లభించిన టైం, తేదీ ప్రకారం దర్శనానికి రావచ్చని, ప్రతి రోజూ 75 వేల దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలియజేశారు. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతిస్తామన్నారు. దర్శన టికెట్ లేని వారు తిరుమలకు రావచ్చు గానీ దర్శనానికి అనుమతించడం సాధ్యం కాదన్నారు.
శ్రీవారి ఆనంద నిలయం బంగారు తాపడం పనులు
డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానుండడంతో 17వ తేదీ నుంచి తిరుమల శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ధనుర్మాసం వచ్చే ఏడాది జనవరి 14న ముగుస్తాయన్నారు. టీటీడీ ఆగమ సలహామండలి సూచనలతో తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనులు చేపడతామన్నారు. ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తామని, 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఈవో తెలిపారు. ఈ సమయంలో శ్రీవారి దర్శనం కొనసాగుతుందని, తాపడం కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని మాత్రమే వినియోగిస్తామన్నారు. ఈ సమయంలో స్వామివారి దర్శనానికి 1957-58 సంవత్సరంలో టీటీడీ అనుసరించిన విధానాన్నే అనుసరిస్తామని ఆయన తెలియజేశారు.
డిసెంబర్ 7న కార్తీక దీపోత్సవం
శ్రీవాణి ట్రస్టు దాతల కోసం డిసెంబరు 1 నుంచి తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్ దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే బస చేసేందుకు గదులు కూడా అక్కడే మంజూరు చేస్తున్నామన్నారు. తిరుమలలో ప్రతి ఏడాదీ తమిళ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ సందర్భంగా అక్కడి చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామి వారికి, ఆంజనేయస్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 7న కార్తీక పర్వదీపోత్సవం నిర్వహిస్తామన్నారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తరువాత ఆలయంలో కన్నులపండుగగా దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023 క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. తిరుమల, తిరుపతితోపాటు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉంటామన్నారు. నవంబరు నెలలో 22.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, రూ.127.31 కోట్ల ఆదాయం లభించిందన్నారు. 1.03 కోట్ల రూపాయలు లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా ఆదాయం లభించిందని, 43.13 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. ఇక 8.91 మంది తలనీలాలు సమర్పించామని ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయంగా కోటంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టే- కాకాణి ఘాటు వ్యాఖ్యలు
K Viswanath Passed Away: విజయనగరంతో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం !
తమ్ముడూ అనిల్ గతం మరచిపోకు- ఆనం ఫ్యామిలీకి నువ్వు చేసిందేంటీ? శ్రీధర్ రెడ్డి కౌంటర్
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!