Srivani Trust : శ్రీవాణి ట్రస్టుపై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు, సోషల్ మీడియా పోస్టులపై టీటీడీ వార్నింగ్
Srivani Trust : శ్రీవాణి ట్రస్ట్ పై అవాస్తవ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. వ్యక్తిగత, రాజకీయ ప్రచారం కోసం టీటీడీపై బురద చల్లడం బాధాకరమని పేర్కొంది.
Srivani Trust : తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పై కొంతమంది అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవాస్తవ ప్రచారాలను తీవ్రంగా ఖండించింది. రాజకీయ, వ్యక్తిగత ప్రచారాలు ఆశించి హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ మీద అవాకులు, చవాకులు పేలడం సరికాదని పేర్కొంది. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల, అటవీ గ్రామాలకు సైతం విస్తరించే లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని తెలిపింది. దీనివల్ల తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో దళారీ వ్యవస్థ సైతం పూర్తిగా కనుమరుగైందని పేర్కొంది. టికెట్ ధర పెట్టుకోగలిగే ఆర్థిక స్థోమత ఉన్న వారు ఎవరి సిఫారసు కోరకుండా, దళారీల బారిన పడి మోసపోకుండా శ్రీవాణి టికెట్ కొని నేరుగా స్వామివారి దర్శనం చేసుకోగలుగుతున్నారని టీటీడీ తెలిపింది.
సోషల్ మీడియాలో పోస్టులు
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ప్రతి పైసా మారుమూల గ్రామాల్లో హిందూ ఆలయాలు, పురాతన ఆలయాల మరమ్మతులు, అభివృద్ధి, పునర్ నిర్మాణం కోసమే ఉపయోగిస్తున్నామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిధుల ద్వారా గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 501 ఆలయాలు నిర్మించామని వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో 1030 ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఇందులో కొన్ని నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు శ్రీవాణి ట్రస్ట్ మీద అవాస్తవాలు చెబుతూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని టీటీడీ పేర్కొంది. ఇలాంటి వ్యక్తుల మీద, సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.
భారీ విరాళం
తిరుమల శ్రీవారికి ఒకే రోజు భక్తులు భారీ విరాళం అందించారు. తమిళనాడు తిరునెల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణ అనే భక్తుడు ఏడు కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. టీటీడీలోని వివిధ ట్రస్టులైన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలేషన్ ఫర్ డిసేబుల్డ్, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టులకు కోటి రూపాయల చొప్పున మొత్తం ఏడు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
రూ. 10 కోట్లు విరాళాలు
తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలికి చెందిన ప్రైవేటు కంపెనీ అధినేత బాలకృష్ణ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు, సీ-హబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ కి కోటి రూపాయలు విరాళం అందించగా, టీటీడీ వేంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు కోటి రూపాయలు అందించారు. వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏ-స్టార్స్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మరో కోటి రూపాయలను విరాళంగా అందించారు. దీంతో ఒకే రోజు దాదాపు పది కోట్ల రూపాయలను వివిధ ట్రస్టులకు విరాళంగా భక్తులు అందించారు. నిన్న రాత్రి తిరుమలలోని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో దాతలు డీడీలను అందజేశారు.